
చెరుకు.. పెట్టుబడి కష్టాలు
చెరుకు పంటపై పెట్టుబడులు ఏటేటా పెరుగుతుండటం సదరు రైతుల్ని కలవరపెడుతున్నాయి. సరైన దిగుబడులు లేక ధర గిట్టుబాటు కాకకష్ట నష్టాలే మిగులుతున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరుకును మరిచి ఇతర పంటలకు మద్దతు ధర పెంచడం, బోనస్‌లు ఇవ్వడం చేస్తుండటంతో చెరకు రైతులు దిగాలు పడిపోతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడితే వచ్చిన పంట దిగుబడితో పెట్టుబడి కోసం చేసిన అప్పులు చెల్లించేందుకే సరిపోతుంది.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ సమీపంలో ట్రైడెంట్, సంగారెడ్డి వద్ద గణపతి, రాయికోడ్ వద్ద గోదావరి–గంగా చక్కెర పరిశ్రమలున్నాయి. మూడు కర్మాగారాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగవుతోంది. ఆయా చక్కెర కర్మాగారాల పరిధిలో సుమారు 10 లక్షల టన్నుల పంటను రైతులు పండిస్తున్నారు. పెరిగిన పెట్టుబడుల వల్ల పెద్దగా లాభాలు రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఎకరా చెరకు పంట సాగు చేయాలంటే పెట్టుబడులన్నీ కలిపి మొదటి ఏడాది లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. సుమారు 30 టన్నుల వరకు పంట పండుతుంది. ప్రస్తుతం కర్మాగారాలు చెల్లిస్తున్న ధరతో పొలిస్తే కటింగ్, రవాణ తదితర ఖర్చులు పోనూ ఎకరాకు రూ.75 వేల మిగులుతుంది. ఏడాది పొడువునా పంట సాగు కోసం ఎరువు, ఇతర పెట్టుబడులకు తిరిగి అప్పు చేయాల్సివస్తుందని రైతులు వాపోతున్నారు.
ఏటా పెరుగుతున్న పెట్టుబడులు
దిగుబడి,గిట్టుబాటు ధర లేక నష్టాలు
ఆందోళనలో చెరుకు రైతులు
వర్షాలతో దెబ్బతిన్న పంట
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరుకు పంట కూడా దెబ్బతింది. చెరకు తోటలో నీరు చేరడం వల్ల పంట ఎదుగుదలపై పడింది. కొన్నిప్రాంతాల్లో పంట ఏపుగా పెరగడం వల్ల గాలి వానకు నేల కొరిగింది. పంటను కాపాడుకొనేందుకు రైతులు అదనంగా ఖర్చు చేసి జుడి(జడ)కట్టడం చేయిస్తున్నారు. అడ్డంగా పడిన చెరుకు గడలు నిటారుగా పెరగడానికి జుడి కడతారు. జుడి కట్టడానికి ఎకరానికి రూ.6 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో రైతులు అప్పుచేసి జుడి(జడ)కట్టిస్తున్నారు. విపరీతంగా పెరిగిన పెట్టుబడుల వల్ల టన్నుకు రూ.3,500 టన్నుకు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
చెరుకు పంటకు బోనస్ ఇవ్వాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పంటలకు ఇచ్చినట్లుగా చెరుకు పంటకు కూడా బోనస్ ఇవ్వాలి. కనీస ధర కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సన్న ఒడ్లకు ఇచ్చినట్లు చెరుకు రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. అప్పుడే చెరుకు రైతులకు మేలు జరుగుతుంది.
– డి.శివకుమార్, రైతు, ఎల్గొయి

చెరుకు.. పెట్టుబడి కష్టాలు