
మళ్లీ టెర్మినల్ ప్రతిపాదనలు
ఈదులనాగులపల్లిలో ఏర్పాటుకు చిగురిస్తున్న ఆశలు టెర్మినల్ రాకతో మెరుగుపడనున్నప్రజా రవాణ వ్యవస్థ! ఇటీవల కేంద్రమంత్రిని కలిసివిన్నవించిన ఎంపీ రఘునందన్‌రావు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ అంశం మరోసారి తెరపైకి రావడంతో స్థానిక ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్నేళ్లుగా టెర్మినల్ ప్రతిపాదనలు వినిపిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ప్రస్తుతం తెల్లాపూర్‌వైపు శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. దీంతో రైల్వే టెర్మినల్ ప్రతిపాదనలు మరోసారి ముందుకురావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తే ప్రజా రవాణ వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
ఈదులనాగులపల్లి అనువైన ప్రాంతం..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు ప్రయాణికులకు సరైన విధంగా సేవలందించలేకపోతోంది. గతంలో రైల్వే అధికారులు దీనిపై నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా చర్లపల్లి, ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను ఇక్కడ నుంచి నడిపించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నాయి. హైదరాబాద్, ముంబై వెళ్లే మార్గంలోనే ఈదులనాగులపల్లి ఉండటం, ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లతోపాటు మరిన్ని ప్లాట్‌ఫామ్‌లను పెంచడానికి అనుకూలమైన ప్రాంతంగా అధికారులు ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే అప్పటి జిల్లా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూసేకరణ సజావుగా సాగలేదు. ఎంపీ రఘునందన్‌రావు ప్రత్యేక కృషితో టెర్మినల్ ఏర్పాటుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
ప్రయాణం మరింత సులభం
పటాన్‌చెరు పారిశ్రామికవాడ కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారు సొంతగ్రామాలకు పోవాలంటే సికింద్రాబాద్, నాంపల్లిలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ సమస్యతో సకాలంలో రైల్వేస్టేషన్‌కు చేరుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో టెర్మినల్ ఏర్పాటైతే స్థానిక యువతతోపాటు వేలాదిమందికి ఉపాధి కలుగుతుందని, అభివృద్ధితోపాటు వాణిజ్య, రియల్ వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయడుతున్నారు.
రైల్వేస్టేషన్‌ను సందర్శించిన
కేంద్ర రైల్వే సహాయ మంత్రి
ఇటీవల బీదర్‌కు వెళుతున్న కేంద్ర రైల్వే సహాయమంత్రి సోమన్నను ఈదులనాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఎంపీ రఘునందన్‌రావు ఆపి సమస్యను వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడి వసతులను చూపించారు. ఇక్కడ రైల్వే టెర్మినల్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరగడంతోపాటు రైల్వే శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని వివరించి వినతిపత్రంఅందజేశారు.
మరింత అభివృద్ధి జరుగుతుంది
ఈదులనాగులపల్లి రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాలను కోరాం. రైల్వే టెర్మినల్ ఈప్రాంత ప్రజలకు ఎంతో అవసరం. దాని వలన ఈప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇందుకోసం తనవంతు కృషి చేస్తాను.
– గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే
టెర్మినల్ ఎంతో అవసరం
ఈ ప్రాంతంలో అనేక రాష్ట్రాల ప్రజలు నివాసముంటున్నారు. వారు సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటే సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌లకు పోతున్నారు. ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే వారి ప్రయాణం సులభంగా మారుతుంది. టెర్మినల్ ఏర్పాటుకు అవసరమైన భూమి కూడా అందుబాటులోనే ఉంది. ఈ విషయాన్ని సంబంధిత కేంద్రమంత్రులదృష్టికి తీసుకెళ్లాం. – ఎం.రఘునందన్ రావు, ఎంపీ

మళ్లీ టెర్మినల్ ప్రతిపాదనలు

మళ్లీ టెర్మినల్ ప్రతిపాదనలు