
సీఎం పర్యటనలోగా డీపీఆర్ సిద్ధం
● ఇంజనీరింగ్ అధికారులసమావేశంలో జగ్గారెడ్డి ఆదేశం ● 30లోగా మంజీరా తాగునీటి పథకం అంచనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో మంజీరా తాగునీటి పథకానికి సంబంధించిన అంచనాలను ఈనెల 30 లోగా సిద్ధం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. కన్సల్టెన్సీ కంపెనీ ఈ డీపీఆర్‌లను సిద్ధం చేయాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశమందిరంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్, పబ్లిక్‌హెల్త్, నీటిపారుదల, మిషన్ భగీరథ, మున్సి పల్ కమిషనర్లతో మంగళవారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రానున్న 50 ఏళ్ల జనాభాకు సరిపడేలా ఈ తాగునీటి పథకాల పైప్‌లైన్లు, ఇంటెక్ వెల్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్‌లను డిజైన్ చేయాలన్నారు. తాళ్లపల్లి ఫిల్టర్‌బెడ్ ఆధునీకరణ, సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల్లోని 54 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు పైప్‌లైన్ల మరమ్మతులకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సదాశివపేట మున్సిపాలి టీకి 25 ఎంఎల్‌డీ, సంగారెడ్డికి 50 ఎంఎల్‌డీ నీటి కేటాయింపుల కోసం నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్‌సీలకు ప్రతిపాదన లేఖలు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, ఆయా శాఖల పర్యవేక్షక ఇంజనీర్లు, డీఈలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డీజేఎఫ్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
సంగారెడ్డి టౌన్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సెప్టెంబర్ 19న జరగనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం 10వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను మంగళవారం సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు దేవదాస్ పాల్గొన్నారు.