
పంట నష్టం 5,548 ఎకరాలు
● అత్యధికంగా పత్తి పంటకు నష్టం ● ప్రభుత్వానికి అధికారుల నివేదిక
సంగారెడ్డి జోన్: గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 5,548 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు వ్యవసాయాధికారులు వెల్లడించారు.
20 మండలాల్లో 4,706 మంది రైతులు
జిల్లాలో 20 మండలాల్లో 4,706 మంది రైతులు పంట పొలాల్లో నష్టం వాటిలినట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో అత్యధికంగా పత్తి పంటకు నష్టం జరగగా సోయాబీన్, వరి, మొక్కజొన్నతోపాటు పప్పు దినుసులు దెబ్బతిన్నాయి. పెసర, మినుము పంటలు కోతదశలో వర్షాలు కురవడంతో రంగు మారి దెబ్బతిన్నాయి.
పరిహారం కోసం ఎదురుచూపులు
కురిసిన వర్షాలకు రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. అదేవిధంగా సాగులో ఉన్న పంటలకు సైతం తెగుళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఎప్పుడు అందుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
ప్రభుత్వానికి నివేదికలు
నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. త్వరలోనే నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తాం. – శివప్రసాద్,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సంగారెడ్డి