
నిరుపయోగంగా ఏడీఏ కార్యాలయం
లక్షల నిధులు వెచ్చించి.. అసంపూర్తిగా వదిలిన వైనం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిధుల కొరత కారణంగా వినియోగంలోకి రాకుండాపోయింది. దీంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ భవానీ మందిరం రోడ్డులో రాచన్నపేట ఉన్న వ్యవసాయశాఖ డివిజన్(ఏడీఏ) కార్యాలయం నిరుపయోగంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన కార్యాలయం భవనం దెబ్బతింది. ఏడీఏ కార్యాలయం పక్కనే ఉన్న గోదాం స్థానంలో నూతన ఏడీఏ కార్యాలయం నిర్మాణానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి ప్రారంభంలో భవన నిర్మాణ పనులు శరవేగంతో చేపట్టారు. ఇంకా కరెంట్, కలర్, లైట్స్, ప్రహారీగోడ తదితర పనులు మిగిలిపోయాయి. నిధుల కొరత వల్ల సదరు కాంట్రాక్టు పనులు అసంపూర్తిగా వదిలేశారు. మరో రూ.10 లక్షలు ఖర్చుచేస్తే ఏడీఏ కార్యాలయ భవనం వినియోగంలోకి వస్తుందన్నారు. అయితే గతేడాది జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పరిశీలించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. కానీ, ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆ కార్యాలయం అసంపూర్తిగా ఉంది.
అసంపూర్తిగా ఉన్న ఏడీఏకార్యాలయ భవనం