
చేపా..చేపా ఎప్పుడొస్తావు!
చేప పిల్లల పంపిణీలో ఈసారి మరింత ఆలస్యం!
● టెండర్లకు ముందుకురాని కాంట్రాక్టర్లు
● త్వరలోనే పంపిణీ చేస్తామంటున్నఅధికారులు
వట్‌పల్లి(అందోల్): మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకం అమలు ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జూలై మూడో వారంలోనే చేపట్టాల్సిన చేప పిల్లల పంపిణీ సెప్టెంబర్ వచ్చేసినా ఈ ప్రక్రియ టెండర్ల దశలోనే ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిధిలో 36,029 హెక్టార్ల విస్తీర్ణంలో 1,135 నీటి వనరులు ఉండగా మూడు రిజర్వాయర్లు, 79 పెద్ద చెరువులు, 1,059 చిన్న చెరువులున్నాయి. 234 మత్య్స సహకార సంఘాలు ఉండగా వీటిలో 12,889 మంది సభ్యులున్నారు. ఈ ఏడాది 3.50 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకోగా 68,31,132 చేప పిల్లలను వదిలినట్లు అధికారులు చెబుతున్నారు.
బిడ్లు దాఖలుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
ప్రభుత్వం జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలకు సంబంధించి గత నెల ఆగస్టు 18 నుంచి 30 వరక్లు టెండర్లను పిలువగా ఒక్కరూ కూడా టెండర్ వేయడానికి రాలేదు. ఇందుకు గతంలో ప్రభుత్వానికి సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి బిల్లులను చెల్లించకపోవడం వంటివి కారణాలుగా తెలుస్తోంది. దీంతో మరోసారి బిడ్లు వేయడానికి ఈనెల (సెప్టెంబర్) 12 వరకు బిడ్లు వేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా శుక్రవారం బాక్స్‌లను ఓపెన్ చేయగా ఒక్కరు మాత్రమే టెండర్ దాఖలు చేశారు. సాధారణంగా రాజమండ్రి, కై కలూరు ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే ఈ ప్రాంతంలో చాలాకాలంగా టెండర్లలో పాల్గొంటున్నారు.
రూ.లక్షలు పెట్టి కొనుగోలు
ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమవుతుండటంతో మత్స్యకారులు సొంత ఖర్చులతో ప్రైవేట్‌గా కొనుగోలు చేసి చెరువులలో వదులుకుంటున్నారు. ప్రభుత్వం పంపిణీచేసే చేప పిల్లల సైజు తక్కువగా ఉండటంతో చెరువుల్లో నీరు తగ్గే సమయానికి చేప అరకిలో వరకు బరువు పెరగడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఉచిత చేప పిల్లల కోసం ఎదురు చూడకుండా సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకువచ్చి వదులుతున్నామంటున్నారు. ఇటీవల అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లిలో మత్య్సకారులు సుమారుగా రూ.3లక్షలు వెచ్చించి ప్రైవేట్‌గా కొనుగోలు చేసి చెరువులలో వదిలారు.
పెరుగుదలపై ప్రభావం
చెరువుల్లో రెండు పరిమాణాల్లో చేప పిల్లలను వదులుతారు. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45రోజుల వయసున్న 35–40 మి.మీ. పొడవున్న వాటిని, ఏడాది మొత్తం నీరు నిల్వ ఉండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75 రోజుల వయసున్న 80–100 మి.మీ. పొడవున్న వాటిని వదులుతారు. నీటిలో వదిలిన తర్వాత కిలో పరిమాణానికి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. జూన్, జూలై నెలల్లో వదిలితే డిసెంబరు నుంచి రెండు, మూడు నెలలపాటు చేపలను పట్టి విక్రయించుకునే అవకాశముంటుంది. దీంతో మత్స్యకారులు చేపల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు.
అక్టోబర్ మొదటి వారంలో!
జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసేందుకు బిడ్లు ఆహ్వానించినా ఎవరూ రాకపోవడంతో రెండుసార్లు గడవు పొడిగించాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నాం. మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. నాణ్యమైన చేప పిల్లలు చెరువుల్లో వదులుతాం.
– మధుసూదన్‌రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి