
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
మునిపల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: ఇటీవల కూలిపోయిన లింగపల్లి గురుకుల హాస్టల్ భవనం స్లాబ్ శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ స్థానంలో కొత్త భవనం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను కలెక్టర్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల కోసం తాత్కాలికంగా రేకుల షెడ్డును పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నూతన భవనం నిర్మించడానికి స్థలాన్ని త్వరితగతిన గుర్తించాలని, లేదంటే కూలిపోయిన భవనం స్థానంలోనే నిర్మించాలంటే శిథిలాలను తొలగించి స్థలం చదను చేయాలని సూచించారు. నూతన భవన నిర్మాణానికి, ఫర్నీచర్, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను త్వరగా తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు, ఎంపీడీఓ హరినంధ్‌రావు పాల్గొన్నారు.
హోటల్ మేనేజ్‌మెంట్ భవనంలో శిక్షణ
జహీరాబాద్: యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా హోటల్ మేనేజ్‌మెంట్ భవనంలో త్వరలో ఉపాధి శిక్షణ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కోహీర్ మండలంలోని కవేలి గ్రామ శివారులోని నిరుపయోగంగా ఉన్న హోటల్ మేనేజ్‌మెంట్ భవనాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వారంలోగా ఈ భవనాన్ని శుభ్రం చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లూరులోని డ బుల్‌బెడ్ రూమ్ ఇళ్లను మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నీతమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా ఉపాధికల్పనాధికారి అనిల్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జరామ్, జహీరాబాద్ ఆర్డీఓ డెవుజా, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య