
మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులు
● ఆర్థిక శాఖ ఆమోదం ● పోస్టింగ్‌ల కోసం 27 మందివిలీన కార్యదర్శుల ఎదురు చూపులు ● మిగతా సిబ్బందికి ఇప్పటికే సర్దుబాటు
సంగారెడ్డి జోన్: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసిన నేపథ్యంలో నాటి నుంచి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ శాఖలో వేతనం పొందుతూ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త ఏర్పడిన మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 165 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జిల్లాకు 27 పోస్టులు ఉన్నాయి.
పోస్టులు మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం
జిల్లాలో నాలుగు విడతల ద్వారా 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. మొదటి, రెండవ విడతలలో విలీనం ఆయన కార్యదర్శులను మున్సిపల్ శాఖలోకి మార్చేందుకు కొత్తగా జిల్లాకు 27 పోస్టులను ఆర్ధిక శాఖ మంజూరు చేసింది. పోస్టులు మంజూరు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవటంతో పోస్టింగుల కోసం ఎదురుచూపులు తప్పలేదు. మూడు, నాలుగు విడతలలో విలీనమైన అధికారులకు పోస్టుల మంజూరు ఎప్పుడు చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరంతా మున్సిపల్ లోనే తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు.
తాత్కాలిక పోస్టులతో విధుల నిర్వహణ
జిల్లాలో విలీన పంచాయతీ కార్యదర్శులు 45తోపాటు మల్టీపర్పస్ వర్కర్లు కూడా ఉంటారు. విలీనం అయిన నాటి నుంచి మున్సిపాలిటీలలో వారి గ్రేడ్‌ల ఆధారంగా రెవెన్యూ అధికారి, జూనియర్ అసిస్టెంట్, వార్డ్ అధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా వివిధ స్థాయిలలో తాత్కాలిక పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని పంచాయతీరాజ్ శాఖలోని కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది విలీన కార్యదర్శులు మున్సిపల్ శాఖలోని విధులు నిర్వహిస్తామంటూ కోర్టును ఆశ్రయించారు. విలీన కార్యదర్శులకు అనుకూలంగా కోర్టు స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్ శాఖకు మార్చే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది.