
గులాంగిరి.. కాదంటే గురి!
పటాన్‌చెరు: జిల్లా అధికారులకు పటాన్‌చెరు పారిశ్రామికవాడ బంగారు బాతుగుడ్డుగా మారింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మండల స్థాయి అధికారులందరూ జిల్లా బాస్‌లకు గులాంగిరి చేస్తేనే ఇక్కడ కొనసాగే పరిస్థితి నెలకొంది. లేకపోతే మారుమూల ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. ఇది ఒక్క రెవెన్యూలోనే కాకుండా పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్ లాంటి ప్రధాన శాఖల్లో ఇదే తంతు నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్డీఓ బదిలీ అంశం పారిశ్రామికవాడ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇక్కడ అధికారులపై చేసిన ఒత్తిడిపై చర్చ జరుగుతుంది. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణల్లో ప్రధానంగా ఆయన జిల్లా ఉన్నతాధికారులకు మధ్యవర్తిగా కూడా పని చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామచంద్రాపురం మండలంలో ఓ అసైన్డ్ భూమికి ఎన్‌ఓసీ జారీ చేసే ప్రక్రియలో గతంలో ఇక్కడ పని చేసిన జిల్లా ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో వార్తలు రావడంతో మీడియాను మచ్చిక చేసుకునేందుకు ఆ ఆర్డీఓ జిల్లా ఉన్నతాధికారికి, మీడియాకు మధ్యవర్తిగా వ్యవహరించారు. సంగారెడ్డి ఆర్డీఓపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఆయనను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను గతంలో ఇక్కడ నుంచి బదిలీ చేస్తే పీసీసీ స్థాయి నేత ఒకరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి ఆర్డీఓగా తిరిగి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర మంత్రిత్వ శాఖ వరకు ఆ ఆర్డీఓ అవినీతి కార్యకలాపాలపై ఫిర్యాదులు అందడంతోనే బదిలీ వేటు పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మండల స్థాయి అధికారులు జిల్లా బాస్‌ల నుంచి అనేక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు తమ అనుకూలమైన సిబ్బందిని మాత్రమే ఈ ప్రాంతంలో కొనసాగనిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసైన్డ్, వక్ఫ్, ప్రభుత్వ, చెరువు భూము లను చెరబట్టేందుకు రియల్టర్లు వేసే ఎత్తుగడలకు జిల్లా స్థాయి అధికారులే లొంగిపోతున్నారని వారి ఆదేశాల తోనే చేసేదేమీ లేక మండల స్థాయిలో అధికారులు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వారు జిల్లా బాస్‌లకు గులాంగిరి చేస్తేనే ఇక్కడ కొనసాగే పరిస్థితి నెలకొంది.
మితిమీరుతున్న
జిల్లా బాస్‌ల ఆగడాలు
పారిశ్రామికవాడలో ఒత్తిడికి
గురవుతున్న రెవెన్యూ అధికారులు
ఇతర శాఖల్లోనూ ఇదే తంతు