
పేలిన వంట గ్యాస్ సిలిండర్
అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
కౌడిపల్లి(నర్సాపూర్): సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసం అయింది. కుటుంబ సభ్యులు ప్రమాదాన్ని పసిగట్టి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈసంఘటన మండలంలోని ముట్రాజ్‌పల్లిలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ తల్లి ఇటీవల చనిపోవడంతో సోమవారం ఏడో నెల మాసికం నిర్వహిస్తున్నారు. దీనికి బంధువులు సైతం వచ్చారు. ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు. పక్క గదిలో మరో గ్యాస్ సిలిండర్ ఉంది. ఇంతలో గ్యాస్ లీకై వాసన రావడంతో శ్రీనివాస్ అప్రమత్తమై ఇంట్లో ఉన్న వారందరిని బయటకు తీసుకొచ్చాడు. ఆసమయంలో ఇంట్లో సుమారు 20 మంది వరకు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో సిలిండర్ పేలింది. ఇంటిలో స్లాబ్ పెచ్చులు ఉడిపడి, గోడలు బీటలు వారాయి. ఈసంఘటనతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ కృష్ణ, ఆర్‌ఐ శ్రీహరి ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.