
‘పత్తి’కి పందుల బెడద
టేక్మాల్(మెదక్): అతివృష్టి, అనావృష్టితో రైతులు అతలాకుతలమవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటకు తీవ్రం నష్టం వాటిల్లింది. ఉన్న పత్తిని కాపాడుకునేందుకు అన్నదాతలు ప్రయత్నిస్తుంటే అడవిపందులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా పంటలను కాపాడుకుంటున్నా ఏదో సమయంలో వచ్చి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. పందుల నివారణలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో ఖరీఫ్ పంటలు పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న, వరి తదితర వాటిని రైతులు సాగు చేశారు. అత్యధికంగా పత్తి, వరిని సాగు చేస్తున్న పంటలను కాపాడుకోవడానికి రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. పత్తి పంటలు సాగుకు మొదట్లో సరైన వర్షాలు కురవకపోవడం ఎదుగుదల లేక ఇబ్బంది పడ్డారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా పత్తి చేనులో నీరు చేరి పాడవడంతో గూడు రాలి తీవ్ర నష్టం జరిగింది. అంతేకాకుండా వర్షాల కారణంగా పత్తి మొక్కలు గిడసబారి ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు కలుపు తీయడం, మందులు చల్లడం, పిచికారీ వంటి పనులు చేస్తున్నారు.
వర్షం నీరు పారడంతో ఎదుగుదల నిలిచిన పత్తి చేను
రేయింబవళ్లు పంటల వద్దే..
పత్తి చేన్లలో అడవిపందులతోపాటు కోతులు సైతం గుంపులు గుంపులుగా తిరుగుతూ లేత పత్తికాయలను తింటూ తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయంగా పంటల చుట్టూ చీరలు, వైర్లు కట్టడం, సీసాలు కట్టి శబ్దం వచ్చేలా చేస్తున్నారు. పందులు, కోతుల బెడదతో రైతులు చేన్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పందులు కొరికి పడేసిన కాయలు కుప్పలు, కుప్పలుగా పడుతున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. కంది, వరి పంటలను సైతం నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. మరో నెల రోజుల్లోనే చేతికి వచ్చే పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి పందుల దాడితో పంటలు నష్టం జరిగి కనీసం పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని అన్నదాతలు బాధపడుతున్నారు.
పత్తి కాయలను తింటున్న వైనం
తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు
రాత్రి, పగలు చేన్ల వద్దే కాపలా
పట్టించుకోని అధికారులు
నివారణ చర్యలేవి?
ప్రభుత్వం అడవి పందులను నివారించాలని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు అమలు చేయడం లేదు. ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని రైతులు వాపోతున్నారు. వన్యప్రాణుల బెడద, నివారణ యంత్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పంటలను కాపాడుకునేందుకు రైతులే నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పంటలను కాపాడుకునేందుకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు.

‘పత్తి’కి పందుల బెడద