
కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
కొండాపూర్(సంగారెడ్డి): కాంట్రాక్ట్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని గొల్లపల్లిలో గల సీసాల పరిశ్రమలో కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ సీసాల కంపెనీలో కార్మికులు ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తున్నారని వాపోయారు. ఆరేళ్లుగా కార్మికులు అదే పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ ఇంకా తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా కార్మికులకు ఈఎస్‌ఐ ,పీఎఫ్, బోనస్ వంటి సౌకర్యం కూడా కల్పించడం లేదన్నారు. కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.