
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా
● 8 వరకు అభ్యంతరాల స్వీకరణ ● 10న తుది జాబితా
సంగారెడ్డి జోన్: త్వరలో నిర్వహించే పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులోభాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి శనివారం జిల్లా వ్యాప్తంగా పంచాయతీలతోపాటు మండల పరిషత్తు కార్యాలయాల్లో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో 1,457 పోలింగ్ స్టేషన్ల వివరాలను ప్రచురించారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై ఈ నెల 6 నుంచి 8 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 9న పరిష్కరించి, 10న జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది జాబితాను ప్రకటిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మౌలిక వసతులు కల్పిస్తూ ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు, విద్యుత్‌తో పాటు దివ్యాంగులకు ర్యాంపు సౌకర్యం కల్పించనున్నారు. గత నెల 30న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులను పరిశీలిస్తూ జాబితా రూపొందించాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.