
నేడే గణేశ్ నిమజ్జనం
ఏర్పాట్లు పూర్తి
● జిల్లాలో 3వేలకు పైగా విగ్రహాల ప్రతిష్ఠాపన
● నేడు రెండువేలకు పైగా నిమజ్జనం
● 800 మంది పోలీసులతో బందోబస్తు
సంగారెడ్డి జోన్: గణనాథుడి నిమజ్జనం వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 11 రోజులపాటు వైభవంగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. జిల్లాలో ఈ సంవత్సరం సుమారు 3వేలకు పైగా వినాయక విగ్రహాలు ప్రతిష్టించారు. ఇప్పటికే పలు విగ్రహాలు నిమజ్జనం జరగగా శనివారం సుమారు రెండు వేల వరకు జరగనున్నట్లు తెలుస్తుంది.
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన రహదారి గుండా చెరువు కట్ట వరకు విద్యుత్ దీపాలు, బారి కేడ్లు, కట్టకు ఇరువైపులా గ్రిల్స్, క్రేన్లు ఏర్పాటు చేశారు. కట్టపై రహదారికి తాత్కాలిక మరమ్మతులు సైతం చేపట్టారు.
పోలీసులతో బందోబస్తు
నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 800 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు డైవర్షన్లు చేశారు. చెరువు వద్ద అనుకోని ప్రమాదాలు జరిగితే సహాయం కోసం గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీంలను అందుబాటులో ఉంచారు.
ప్రశాంతంగా నిమజ్జనానికి చర్యలు
గణపతి నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. 800 మంది పోలీసు బందోబస్తుతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. శోభాయాత్ర సమయంలో నిర్వాహకులు అవసరం మేరకు అన్ని రకాల జాగ్రత్తలు వహించాలి. పోలీసు అధికారులకు సహకరించాలి.
– పరితోష్ పంకజ్, జిల్లా ఎస్పీ

నేడే గణేశ్ నిమజ్జనం