
శిథిలమై.. మూతబడి
పాఠశాల భవనం శిథిలమై పెచ్చులూడుతున్నాయి. తరగతి గదులు ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందన్న భయంతో స్కూల్‌ను మూసేశారు. ఉర్దు మీడియం ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌లోకి స్కూల్‌ను మార్చారు. షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒంటిపూట బడి కారణంగా పాఠాలు అర్థంకాక విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. కాగా మల్‌చెల్మలో నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– జహీరాబాద్ టౌన్:
జహీరాబాద్ మండలంలోని మల్‌చెల్మ గ్రామంలో 1969లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం నిర్మించారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఉర్దు మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. సుమారు 200 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో 16 గదులు ఉండగా దశాబ్దాల కాలం క్రితం నిర్మించిన కారణంగా వాటిలో 14 గదులు పూర్తిగా దెబ్బతిని శిథిలమయ్యాయి. భవనం గోడలు బీటలు వారి పైకప్పు పెచ్చులు ఊడి స్లాబ్ కూలుతుంది. వర్షం కురిస్తే చాలు తరగతి గదుల్లో నీరు వచ్చి చేరుతుంది. ఏ క్షణమైనా కూలుతుందన్న భయంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉన్నత పాఠశాలను ప్రైమరీ స్కూల్ బిల్డింగ్‌లోకి తరలించి, నాలుగేళ్ల నుంచి షిఫ్టుల పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 12.30 గంటల వరకు ప్రైమరీ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిఫూట బడి నడుస్తుంది.
శిథిలావస్థకు చేరిన మల్‌చెల్మ పాఠశాల భవనం
నష్టపోతున్న విద్యార్థులు
మల్‌చెల్మలో షిఫ్టు పద్ధతిలో తరగతుల నిర్వహణ
పడిపోతున్న విద్యాప్రమాణాలు
తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
పట్టించుకోని అధికారులు
షిఫ్టుల పద్ధతితో ఉన్నత పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నారు. సమయం తక్కువగా ఉండటం వల్ల పాఠాలు అర్థం కావడం లేదని, దూర ప్రాంతాల నుంచి రాకపోకలకు కష్టమవుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ఒంటి ఫూట వల్ల పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని, ఆటలాడటం వల్ల చదవుపై శ్రద్ధ పెట్టడం లేదని తల్లిదండ్రులు టీసీలు తీసుకెళుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. విద్యార్థుల సంఖ్య 300 నుంచి ప్రస్తుతం 200 మందికి వచ్చింది. 2012 సంవత్సరంలో హైస్కూల్‌కు నూతన భవనం కోసం రూ. 2 కోట్లు మంజూరయ్యాయి. నూతన భవన నిర్మాణం కోసం రెండెకరాల స్థలం కూడా ఎంపిక చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంత వరకు నిర్మాణ పనులకు ముందడుగు పడలేదు. నిధులు రద్దు కాగా ఆ తరువాత పాఠశాల గురించి పట్టించుకునే వారు కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కలెక్టర్ శ్రద్ధ తీసుకుని మల్‌చెల్మ పాఠశాలకు నూతన భవనాన్ని కట్టించాలని కోరుతున్నారు.

శిథిలమై.. మూతబడి