
సెక్యూరిటీ నియామకం.. వివాదం
కొల్చారం(నర్సాపూర్): సెక్యూరిటీ గార్డుల నియామకంలో స్థానిక యువతకే అవకాశం కల్పించాలని ఐఎంఎల్ డిపో ఎదుట నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. శుక్రవారం మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామ శివారులోని ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్)డిపోలో సెక్యూరిటీ నియామకంలో అవకతవకలు జరిగాయంటూ నిరుద్యోగులు ప్రభుత్వానికి, డిపో మేనేజర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో హమాలీల నియామకంలో కొందరు, డిపో మేనేజర్ కుమ్మకై ్క లక్షల రూపాయలు దండుకొని అమ్ముకున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎకై ్సజ్ కమిషనరేట్, ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అప్పట్లో ధర్నాకు దిగడంతో నియామకాలు రద్దు చేశారని, అయితే ప్రైవేటుగా ఏ నియామకం చేపట్టినా స్థానిక యువతకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందన్నారు. కొన్ని రోజుల క్రితం డిపోలో పనిచేస్తున్న 5 మంది సెక్యూరిటీ గార్డులు పదవీ విరమణ పొందగా, వారి స్థానంలో నియామకం కోసం ఎంకే సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు.
ఐఎంఎల్ డిపో ఎదుట నిరుద్యోగుల నిరసన