
అంత్యక్రియలకు వెళ్లి.. కుంటలో గల్లంతై..
జగదేవ్‌పూర్(గజ్వేల్): అంత్యక్రియలకు వెళ్లిన యువకుడు కుంటలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన చిక్కుడు రాజు(26) ఆ అంత్యక్రియలకు వెళ్లాడు. అవి పూర్తి కాగానే బస్వారెడ్డి కుంటలోకి స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. వెంటనే పక్కన ఉన్నవారు రాజు కోసం కుంటలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది కుంటలో ఈత వచ్చిన వారితో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి పడటంతో బుధవారం గజ ఈతగాళ్ల సహాయంతో వెతకనున్నట్లు పోలీసులు తెలిపారు.