‘ఐఐటీ’తో చింతమడక పాఠశాల భాగస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

‘ఐఐటీ’తో చింతమడక పాఠశాల భాగస్వామ్యం

Jul 15 2025 12:31 PM | Updated on Jul 15 2025 12:31 PM

‘ఐఐటీ’తో చింతమడక పాఠశాల భాగస్వామ్యం

‘ఐఐటీ’తో చింతమడక పాఠశాల భాగస్వామ్యం

సిద్దిపేటరూరల్‌: స్కూల్‌ కనెక్ట్‌ పేరుతో ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండల పరిధిలోని చింతమడక పాఠశాల భాగస్వామ్యం అవుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఐఐటీలో చేరడానికి కావలసిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌న్స్‌, డేటా సైన్స్‌, వివిధ కోర్సులకు సంబంధించిన కోడింగ్‌ తదితర వాటిపై అవగాహన, ఐఐటీ ప్రొఫెసర్లతో ఆన్‌లైన్‌లో విద్యార్థులు నేర్చుకుంటారని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లు భాగస్వామ్యం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాల్‌రాజు, అజీజ్‌, రాందాస్‌, శ్రీహరి, రాంరెడ్డి, సత్తయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పీడీ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు.

దాడి చేసిన వ్యక్తి రిమాండ్‌

నంగునూరు(సిద్దిపేట): మహిళపై దాడి చేసిన వ్యక్తిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్‌ కథనం ప్రకారం.. రాంపూర్‌కు చెందిన గండికోట సంపత్‌, రాజవ్వను ఇదే గ్రామానికి చెందిన దున్నపోతుల నరేశ్‌, పరశురాములు, శారద పెంట్రింగ్‌ కర్రతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నరేశ్‌ను కోర్టులో హాజరు పరచగా న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది.

భార్యాభర్తల గొడవ... చిన్నారి మృతి

శివ్వంపేట(నర్సాపూర్‌): భార్యాభర్తల గొడవలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై మధుకర్‌ రెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రమైన శివ్వంపేట దళితవాడకు చెందిన కుంట లావణ్య, మహేష్‌ దంపతులకు నాలుగేళ్ల కూతురు చైత్యతో పాటు 11 నెలల కూతురు ఆకాంక్ష ఉంది. 10 రోజుల క్రితం బయటి నుంచి ఇంటికొచ్చిన మహేష్‌ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. ఆమె చిన్న పాప ఏడుస్తుందని నీవే పెట్టుకుని తినమని చెప్పింది. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేష్‌ భార్యపై దాడి చేసిన క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కూతురు ఆకాంక్ష తలకు బలమైన గాయమై అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతిచెందింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తెగిపడ్డ లిఫ్ట్‌ ..

పరిమితికి మించి ఎక్కడంతో ప్రమాదం

పలువురికి గాయాలు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): లిఫ్ట్‌లో పరిమితికి మించి ఎక్కడంతో ఒక్కసారిగా తెగిపడింది. ఈ ఘటనలో పలువురు మహిళా కార్మికులు గాయాలపాలయ్యారు. పోలీసుల కఽథనం ప్రకారం... కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం రాత్రి రామచంద్రాపురం పట్టణంలోని బట్టల దుకాణంలో దుస్తులకు ఉన్న ట్యాగులను తొలగించే పనికి వచ్చారు. సోమవారం ఉదయం వరకు పని చేశారు. ఇంటికి వెళ్లేందుకు రెండవ అంతస్తు నుంచి లిఫ్ట్‌లో సుమారు 14మంది లిప్టులో ఎక్కారు. ఒక్కసారిగా లిఫ్ట్‌ తెగి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో పింకీ అనే కార్మికురాలికి కాలు ఫ్రాక్చర్‌ అయింది. మిగితావారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంట్లో భారీ చోరీ

రూ.10 లక్షలు, బంగారం అపహరణ

చిన్నశంకరంపేట(మెదక్‌): తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగలు చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నార్సింగి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన బోండ్ల శ్రీనివాస్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం భార్య, పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువా తెరిచి ఉందని కుమారుడి పెళ్లి ఖర్చుల కోసం తీసుకువచ్చిన రూ.10 లక్షలు, 3 తులాల బంగారం, 10 తులాల వెండిని దుండగులు ఎత్తుకెల్లినట్లు బాధితుడు తెలిపారు. తూప్రాన్‌ డీఎస్‌పీ నరేందర్‌గౌడ్‌, ఇన్‌చార్జీ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ అహ్మద్‌మోహినోద్దీన్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీమ్‌ బృందం ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న టిప్పర్‌ను

ఢీకొట్టిన బైక్‌

ప్రమాదంలో వ్యక్తి మృతి

జిన్నారం (పటాన్‌చెరు): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... దాదిగూడెం సోలక్‌పల్లి రహదారిపై టిప్పర్‌ లారీ బ్రేక్‌ డౌన్‌ కావడంతో డ్రైవర్‌ పక్కనే నిలిపాడు. ఈ క్రమంలో సోలక్‌పల్లి నుంచి జిన్నారం వైపు వస్తున్న మంబాపూర్కు చెందిన కంజర్ల సుదర్శన్‌ (40) ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి టిప్పర్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement