
పరిశ్రమలు నిబంధనలు పాటించాలి
అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి
పటాన్‌చెరు టౌన్: అగ్ని ప్రమాదాల పట్ల పారిశ్రామికవేత్తలంతా అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి పరిశ్రమలో రక్షణ పరికరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. సోమ వారం పాశమైలారం ఐలా ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా కొన్ని పరిశ్రమల్లో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు లేవని, పలు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్న కెమికల్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నిపుణులైన కార్మికులను నియమించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో అగ్నిమాపకశాఖ సమర్థవంతంగా పనిచేసి ఎక్కువ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కృషి చేయడం హర్షించ తగిన విషయమన్నారు. కాగా సిగాచీ పరిశ్రమ ఘోర ప్రమాదం నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలని, అగ్ని ప్రమాదాల విషయంలో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.