● మహిళా స్వయం సహాయక బృందాలకు మేలు
● ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
● ఆపత్కాలంలో భరోసా
నారాయణఖేడ్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి ప్రమాద బీమాను 2029వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని మహిళా స్వయం సహాయ సంఘాలకు ప్రమాద సమయంలో భరోసా కల్పించినట్లైంది. సంఘాల సభ్యులుగా ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు బీమా పరిహారం పొందే సౌలభ్యం ఉంది. జిల్లాలో 688 గ్రామైఖ్య సంఘాలు ఉండగా పొదుపు సంఘాలు 18,213 ఉన్నాయి వాటిల్లో 1,90,426మంది సభ్యులు ఉన్నారు. ఈ మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయా యూనిట్లు, స్వయం ఉపాధి అవకాశాలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రమాద బీమాను 2029వరకు పొడిగించడంవల్ల ఈ సభ్యులందరికీ మేలు చేకూరనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్ర నిధి ద్వారా అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో 5గురు ప్రమాదం వల్ల మరణించగా వారికి రూ.50లక్షలు, రుణాలు పొంది సాధారణ మరణం పొందిన 89మందికి రూ.76లక్షలు విడుదలయ్యాయి. వీటిని త్వరలో జిల్లా అధికారులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ పథకం ఉద్దేశ్యం
మహిళను మహారాణులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ పథకాల రూకల్పన చేస్తుంది. స్వయం సహాయ సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు సీ్త్రనిధి రుణాలను అందిస్తూ వారు స్వశక్తితో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు. సంఘంలో సభ్యులకు ప్రత్యేకంగా రుణ, ప్రమాద బీమా పథకాలను ప్రవేశపెట్టింది. సభ్యులు ఎవరైనా సాధారణ, ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రత్యేకంగా రుణ, ప్రమాద బీమాలు అమలయ్యేలా చర్యలు చేపట్టింది. రుణ బీమా పథకంలో సహజ మరణం పొందితే రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల వరకు అందించనుంది.
సభ్యుల భద్రతకు పథకం దోహదం
స్వయం సహాయక సంఘాల సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా ప్రమాద బీమా పథకాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగిస్తూ కొత్త జీవోను విడుదల చేసింది. మహిళా స్వయం సహాయక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబనకు, సామాజిక సాధికారతకు కీలమైన వేదికలు. ఈ బృందాల ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించుకోవడంతో పాటు చిన్న తరహా పొదుపును ప్రోత్సహిస్తున్నారు. తద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. కాగా, అనేక సందర్భాల్లో దురదృష్టవశాత్తు జరిగే ప్రమాదాలు వారి జీవితాలను, వారి కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు ఇది ఒక పెద్ద ఊరట. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా కొంతమేర రక్షణ లభిస్తుంది.
ఖేడ్‌లో సమావేశమైన స్వయం సహాయ సంఘాల సభ్యులు
కుటుంబాలపై భారం లేకుండా..
సభ్యురాలు ప్రమాదశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10లక్షలు నామినీ ఖాతాలో జమ చేస్తారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి రూ.5లక్షలు అందజేయనున్నారు. ఈ పథకం ప్రారంభించకముందు రుణం పొందినవారు మరణిస్తే వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబీకులు, సంఘం సభ్యులపై పడేది.
వీరు అర్హులు..
జిల్లా గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో 18 నుంచి 59ఏళ్ల వారు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నట్లయితే బీమా వర్తిస్తుంది. పథకాన్ని గతేడాది మార్చి 14న ప్రారంభించగా అప్పటి నుంచి ఎవరైనా మృతి చెందితే ఈ పథకానికి అర్హులు. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకున్న వారు మరణిస్తే ప్రభుత్వం చేయూత అందిస్తుంది.