మొక్కజొన్న సాగుకే మొగ్గు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న సాగుకే మొగ్గు

Jul 12 2025 7:16 AM | Updated on Jul 12 2025 7:16 AM

మొక్క

మొక్కజొన్న సాగుకే మొగ్గు

ఈ ఏడాది జహీరాబాద్‌ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తారంగా సాగవుతోంది. గతేడాది పత్తి అధికంగా సాగు కావడంతో ఈ సారి పంట మార్పిడి అవుతుందని, నమ్మకమైన పంట కావడంతో మొక్కజొన్నకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తగిన మేర వర్షాలు కూడా లేకపోవడంతో మినుము, పెసర సాగుకు అదను మించిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేస్తున్నారు.

జహీరాబాద్‌: జహీరాబాద్‌ డివిజన్‌లో 90 శాతం మేర మొక్కజొన్న పంట సాగవుతోంది. ఇప్పటికే 10వేల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 2వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి మాత్రం 75 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇంకా మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వర్షపాతం లేకపోవడంతో మినుము, పెసర సాగుకు సమయం మించిపోవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. జిల్లాలోనే జహీరాబాద్‌ ప్రాంతంలో మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. డివిజన్‌ పరిధిలోని జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి మండలాల్లో పంట సాగులోకి వచ్చింది. అత్యధికంగా కోహీర్‌ మండలంలో రైతులు సాగు చేస్తున్నారు. డివిజన్‌ పరిధిలో 80 శాతం పంట ఈ మండలంలోనే సాగవుతోంది. మొక్కజొన్నలో అంతర పంటగా కంది వేస్తున్నారు. బావులు, బోర్లు ఉన్న రైతులు మాత్రం ఒక్క మొక్కజొన్న పంటనే వేసుకుంటున్నారు. పంట తీసుకున్న తర్వాత రెండో పంటగా శనగ లేదా తెల్లకుసుమ పంటను సాగు చేయనున్నారు.

గిట్టుబాటు ధర ఉండడంతో..

మొక్కజొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,360 కనీస మద్దతు ధర ప్రకటించింది. దీంతో ఈ పంట వేసే గిట్టుబాటు అవుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కలుపు నివారణ, పంట కోతకు కూలీల అవసరం లేకపోవడం కూడా ఓ కారణమని అధికారులు చెబుతున్నారు. కలుపు నివారణ మందులను స్ప్రే చేసుకోవడం, పంట చేతికి వచ్చాక యంత్రాల సహాయంతో రాసులు చేసుకునే వెసులుబాటు ఉండటంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.

జహీరాబాద్‌ డివిజన్‌లో గతేడాది కంటే అత్యధికం

తగినంత వర్షపాతం లేకపోవడంతో

రైతుల ఆసక్తి

గిట్టుబాటు ధర,

నమ్మకంగా చేతికొస్తుందనే ఆశ

కూలీల అవసరం

ఉండక పోవడమే కారణం

తెగుళ్లను తట్టుకొని..

తెగుళ్లు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంట చేతికి వస్తుండటంతో రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుతున్నారు. అధిక వర్షాలు కురిస్తే ఇతర పంటలు దెబ్బతింటున్నాయని, ఈ పంటను వేస్తే పంట దిగుబడి ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు వస్తుండటంతో సాగు చేస్తున్నారు.

పెరిగిన సాగు విస్తీర్ణం

తగినన్నీ వర్షాలు పడకపోవడంతో రైతులు మొక్కజొన్న సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. పత్తి, సోయాబీన్‌, కంది, మినుము పంటల సాగు సమయం మించి పోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న ఎప్పుడైనా సాగు చేసే వీలుండటంతో సాగు పెరిగింది. ఇంకా రైతులు మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటున్నారు.

–ప్రదీప్‌కుమార్‌, ఏఈఓ, జహీరాబాద్‌

మొక్కజొన్న సాగుకే మొగ్గు1
1/1

మొక్కజొన్న సాగుకే మొగ్గు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement