నేడు తుది జాబితా | - | Sakshi
Sakshi News home page

నేడు తుది జాబితా

Jul 12 2025 11:23 AM | Updated on Jul 12 2025 11:23 AM

నేడు తుది జాబితా

నేడు తుది జాబితా

మొదట ప్రాదేశిక ఎన్నికలు..

మండల ప్రాదేశిక స్థానాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ ఎన్నికలు ముందుగానే నిర్వహించే అవకాశం కన్పిస్తోంది. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ బీఫారంపై జరుగుతుండటంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సవాల్‌గా స్వీకరించనున్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరగగా, ఎంపీపీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఉంటుంది. గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా మండలాల ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ననుసరించి పంచాయతీరాజ్‌ శాఖ రిజర్వేషన్లపై త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేపట్టింది.

● కొలిక్కి వచ్చిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజన

● జిల్లాలో మొదలైన ఎన్నికల వేడి

● కొత్త మండలాల వారీగా ఎన్నికలు

నారాయణఖేడ్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎంపీటీసీల పునర్విభజన ప్రక్రియ దాదాపు ఖరారు కావడంతో జిల్లాలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ)ల పునర్విభజన షెడ్యూల్‌ ప్రకటించడం..పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 285–ఏ సవరణకు మంత్రి మండలి నిర్ణయించడం..మొదట మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో ఎన్నికల సంఘం ఆదిశగా చర్యలు ప్రారంభించడంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇదివరకున్న మండల పరిషత్తులు, మండల ప్రాదేశిక నియోజకవర్గాల వివరాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను మినహాయిస్తూ కొత్త మండలాలల్లో ఎంపీటీసీల సంఖ్య ఖరారు చేస్తున్నారు. దాదాపు జెడ్పీటీసీల సంఖ్యపై స్పష్టత రాగా ఎంపీటీసీలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాగానే ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ఆధారంగా ఎన్నికల సమరానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోనున్నాయి.

కొత్త మండలాల వారీగా పునర్వ్యవస్థీకరణ

జిల్లాలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా పాత మండలాల పరిధిలోని గ్రామాలను కలుపుతూ కొన్ని ఎంపీటీసీ స్థానాలు కొనసాగాయి. కాగా, ప్రస్తుతం అలాకాకుండా కొత్త మండలాల వారీగా ఎంపీటీసీ, మండల పరిషత్తు, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు కానున్నాయి. జిల్లాలో గతంలో 271 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుత పునర్వ్యవస్థీకరణతో ఎంపీటీసీ స్థానాలు ఖరారవుతాయి. 27మండలాలకు 27 జెడ్పీటీసీ స్థానాలు, అదే స్థాయిలో ఎంపీపీలు కొలువు దీరనున్నారు. ప్రతీ మండలంలో ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన ఆదేశించారు. ఆదిశగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకటన జరగగా తుది జాబితాను ఈనెల 12న అధికారులు ప్రకటించనున్నారు. ఖేడ్‌ నియోజవకర్గంలో నిజాంపేట్‌, ఆందోల్‌ నియోజకవర్గంలో చౌట్‌కూర్‌ కొత్త మండలాలుగా ఏర్పాటు కాగా ఈ మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొలువుదీరనున్నారు. ఇటీవల అమీన్‌పూర్‌, జిన్నారం మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో వీటిల్లోని ప్రాదేశిక స్థానాలు తొలగిపోయాయి.

ఇప్పటికే పూర్తయిన శిక్షణ

టీ స్వాన్‌ ద్వారా శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లు జిల్లాలో బూత్‌లెవల్‌ అధికారులు ఇదివరకే శిక్షణను పూర్తి చేశారు. వారికి బీఎల్‌ఓ యాప్‌ద్వారా ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు తదితర అంశాలను వివరించారు. ప్రతీ బూత్‌స్థాయి అధికారి డోర్‌ టూ డోర్‌ వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూసుకోవాల్సి ఉంది. కాగా, ఈసారి ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలోనే ఒకేరకమైన యూనిఫాం శిక్షణను ఎన్నికల అధికారులు ఇచ్చింది. అధికారులు పోలింగ్‌ బూత్‌ల పరిశీలన, అక్కడ సౌకర్యాలు తదితరాలపై ఇదివరకే జిల్లా అధికారులకు నివేదిక సమర్పించారు. అందుకనుగుణంగా ఎన్నికల సంఘానికి జిల్లా అధికారులు నివేదించారు. కాగా, గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలవుతుంది. పార్టీల్లో సైతం సమావేశాలు, దిశా నిర్దేశాలు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement