
డబుల్ బెడ్రూంల తాళాలు ఇవ్వండి
జహీరాబాద్ టౌన్: హోతి(కె) వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో డబుల్‌బెడ్రూం కాల నీకి తరలివచ్చారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను ఎందుకు అప్పగించడం లేద ని, 12 తేదీన ఇళ్ల తాళాలు ఇస్తామని చెప్పి ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. తాళాలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించారు. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ కాశీనాథ్ ఆందోళన కారులతో మాట్లాడారు. రెండవ శనివారం ఇళ్ల కేటాయింపు వాయిదా పడిందని, మరో రోజు అప్పగిస్తారని నచ్చజెప్పారు. అక్కడి నుంచి లబ్ధిదారులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభు త్వం హోతి(కె) వద్ద పేదల కోసం 660 ఇళ్లను కట్టించగా అధికారులు డ్రా ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారని చెప్పారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇళ్లను అప్పగించడం లేదన్నారు. డీఎస్‌పీ సైదానాయక్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు. తహసీల్దార్ దశరథ్ కూడా ఫోన్‌లో మాట్లాడారు. ఉన్నతాధికారులతో చర్చించి ఇళ్ల కేటాయింపుకు మరో తేదీని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు.