
ఆర్టీసీకి మహిళా సంఘాల బస్సులు
ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చర్యలు
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు రంగాలలో అవకాశాలు కల్పిస్తుండగా, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది.
జిల్లాకు 20 బస్సులు కేటాయించే అవకాశం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, మిల్క్‌పార్లర్లు, మహి ళా పెట్రోల్ బంక్, పాఠశాల విద్యార్థులకు యూని ఫాం కుట్టడంతోపాటు వివిధరకాలు యూనిట్లు ప్రవేశపెట్టింది. ఈక్రమంలో మహిళా శక్తి పథకం ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె కు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు 20బస్సుల వరకు అప్పగించే అవకాశముంది.
మరింత ఆదాయం
జిల్లాలో ఉన్న మండల మహిళా సమాఖ్య సభ్యులతో అద్దె బస్సులు ఇవ్వనున్నారు. రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ఉండటంతో పాటు వివిధ రకాల అర్హతలను పరిశీలించి సంఘాలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గ్రాంట్ ద్వారా రూ. 30 లక్షలు, సమాఖ్య సభ్యులతో రూ. 6 లక్షలు ఇప్పించి బస్సులను కొనుగోలు చేయనుంది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. సంస్థ ప్రతి నెల సంబంధిత సభ్యులకు నెలకు సుమారు రూ. 70 వేలు చెల్లించనుంది. దీంతో సుమారురూ. 14 లక్షల ఆదాయం సమకూరనుంది. ఫలితంగా మహిళలకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జిల్లా వివరాలు
జిలా మహిళా సమాఖ్య 1
మండల మహిళా సమాఖ్యలు 25
గ్రామ మహిళా సమాఖ్యలు 695
మహిళా గ్రూపులు 18,488
గ్రూపులలోని మహిళా సభ్యులు 1,91,455

ఆర్టీసీకి మహిళా సంఘాల బస్సులు