
‘పైరాలసిస్’ పీసీబీ కొరడా
● మూడు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్లు జారీ ● స్టేట్ లేవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీఆదేశాలతో చర్యలు ● విచ్చలవిడిగా కాలుష్యం వదులుతున్న టైర్లు కాల్చే కంపెనీలు
పైరాలసిస్ పరిశ్రమలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విచ్చలవిడిగా కాలుష్యం వెదజల్లుతూ పరిసర గ్రామాల ప్రజల జీవనానికి ఇబ్బందిగా మారుతున్న పైరాలసిస్ పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. కొండాపూర్ మండలంలోని మూడు పైరాలసిస్ పరిశ్రమలను మూసివేయాలని పీసీబీ క్లోజర్ ఆర్డర్ జారీ చేసింది. మరో ఐదు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ జారీ చేసేందుకు నోటీసులు జారీ చేసింది. జిల్లాలో పీసీపీ నుంచి అనుమతులు పొందిన పైరాలసిస్ పరిశ్రమలు 19 ఉన్నాయి. కొండాపూర్ మండలంలోని ఎదురుగూడెం, మల్లేపల్లి, గుంతపల్లి, గొల్లపల్లి, తేర్పోల్ తదితర గ్రామాల శివారుల్లో ఉన్నాయి. అలాగే పాశమైలారం పారిశ్రామికవాడలో కూడా ఈ పైరాలసిస్ పరిశ్రమల యూనిట్లు ఉన్నాయి.
పాతటైర్లను కాల్చి..
పాత టైర్లను కాల్చి అందులోంచి ఆయిల్‌తో పాటు, ఇతర ఉప ఉత్పత్తులను తయారు చేసే ఈ పైరాలసిస్ పరిశ్రమలు భారీగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విచ్చలవిడిగా గాలి కాలుష్యంతో పాటు, భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. టైర్లను కాల్చే క్రమంలో దట్టమైన నల్లని పొగ కమ్ముకొని పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యాపిస్తోంది. పరిసర గ్రామాల రైతులు వ్యవసాయం చేయాలంటే కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తెల్ల రంగులో ఉండాల్సిన పత్తి పూర్తిగా మసిబారి పోతుండటంతో స్థానిక రైతులు ఈ పంటను వేయడమే మానేశారు. పాత టైర్లను కాల్చడం ద్వారా వచ్చే ఆయిల్‌ను డాంబార్ (తారు) కంపెనీలకు విక్రయిస్తుంటారు. బూడిదను సిమెంట్ ఉత్పత్తి చేసే కంపెనీలకు అమ్ముతుంటారు. టైర్లలో ఉండే ఐరన్ తీగలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.
మరో ఐదు పరిశ్రమలపైన చర్యలు
పైరాలసిస్ పరిశ్రమల కాలుష్యంపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశాం. ఈ మేరకు నివేదికను రాష్ట్రస్థాయిలోని టాస్క్‌ఫోర్స్ కమిటీకి పంపాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ మూడు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్లు జారీ చేశాం. రానున్న రోజుల్లో మరో ఐదు పరిశ్రమలకు కూడా క్లోజర్ ఆర్డర్లు జారీ చేస్తాం.
– గీత సపారే, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, పీసీబీ, సంగారెడ్డి
స్థానికుల కష్టాలపై ‘సాక్షి’ కథనం..
ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ నెల రోజుల క్రితం సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ‘పైరాలసిస్ పరేషాన్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంతో పీసీబీ అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో ఎట్టకేలకు మూడు పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పీసీబీ అధికారులు కాలుష్యం కారక పరిశ్రమలపై చర్యలకు ఉపక్రమించాలంటే రాష్ట్రస్థాయిలో ఉన్న టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదికలు పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికలను పరిశీలించిన కమిటీ ఆయా పరిశ్రమలపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలు వచ్చాక జిల్లా పీసీబీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తారు.

‘పైరాలసిస్’ పీసీబీ కొరడా

‘పైరాలసిస్’ పీసీబీ కొరడా