
సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఉమెన్ చాంపియన్ టోర్నీ నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరాం, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శని, ఆదివారాల్లో స్థానిక సిటీజన్ క్లబ్ ఆధ్వర్యంలో టోర్నీ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలను శనివారం సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.
పునరావాస పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన కోసం ఉపాధి, పునరావాస పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.లక్ష్మికాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదేళ్లలో మహిళలు, పిల్లలు , వికలాంగులు, వయోవృద్ధుల శాఖ, ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి సబ్సిడీ పొంది ఉండరాదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు https:// tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి కమి టీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కోర్సులు..
ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డ్రైవింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యూటీషియన్, జ్యూట్‌బ్యాగ్, టైలరింగ్, లాజిస్టిక్ రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు www.wdsc.telangana .gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040– 24559050 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో
అరుదైన శస్త్ర చికిత్స
గర్భిణిని కాపాడిన వైద్యులు
గజ్వేల్: గజ్వేల్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి చెందిన వైద్యులు ఓ తల్లికి కఠినమైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. వివరాలు... గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని వేములగట్ గ్రామానికి చెందిన ఎర్రన్నగారి ప్రవీణ ఇన్ ఫర్టిలిటీ ద్వారా గర్భం దాల్చింది. కానీ ఈ గర్భం అసాధారణ రీతిలో గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్‌లో పిండం ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా ఆమెకు రక్తం 7హెచ్‌బీ గ్రాములు మాత్రమే ఉందని, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ప్రభుత్వాస్పత్రిని సదరు మహిళ ఆశ్రయించింది. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స చేసేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఏర్పాట్లు చేశారు. ఆమె కడుపులోంచి 500 గ్రాముల పిండం రక్తపు గడ్డలను ఫెలోపియన్ ట్యూబ్‌లో నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది. డాక్టర్ అన్నపూర్ణతో పాటు ప్రణయరెడ్డి, మత్తుమందు వైద్యులు సూర్య, ఓటీ థియేటర్ అసిస్టెంట్ శ్రీలత తదితరులు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.
బావిలో పడి కూలీ మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): బావిలో పడి కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని విఠలాపూర్‌లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మేకల రవి(45) కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కూలీ పనులకు వెళ్లాడు. వ్యవసాయ భావి సమీపంలో చెట్టును కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడ్డాడు. ఇది గమనించిన తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించి వారి సహాయంతో రవిని బయటకు తీశారు. వెంటనే ప్రైవేటు వాహనంలో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైఫ్ అలీ తెలిపారు.