
భద్రత.. పునరావాసం
కార్మికులకు వరం నమస్తేపథకం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అమలు గుర్తించిన కార్మికుల వివరాలు యాప్‌లో నమోదు
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీల పరిధిలో మరుగుదొడ్ల వ్యర్థాలను తొలగించే పాకీ పనివారు, సెఫ్టిక్ ట్యాంక్‌లు, మురుగు కాల్వలు, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రపరిచే కార్మికులు, చెత్త ఏరుకునే వారి శ్రేయస్సు కోసం కేంద్రం ‘నమస్తే’అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో జాతీయ యాంత్రిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ (నమస్తే) పథకం కింద గుర్తించిన కార్మికులను యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఆయా వృత్తుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల భద్రత, పునరావాసం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత గౌరవంతో పాటు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకోవడం, వారికి పరికరాలు అందించడం, పునరావాసం కల్పించడం, ఆధునిక, సురక్షిత పద్ధతుల్లో వారికి శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ఈఽ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ కోవలోకి వచ్చే కార్మికులకు రక్షణ కల్పించేలా ఈ పథకం ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల పాలవుతున్నట్లు గుర్తించిన కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత మేరకు యంత్రాలను ఉపయోగించి వీరు పనిచేసేలా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమస్తే యాప్‌లో నమోదు చేస్తున్నారు.
చెత్త ఏరుకునే వారు సైతం..
సాధారణంగా పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవితం వెళ్లదీస్తున్నాయి. వీరు డంప్‌యార్డులు, ఇతర ప్రదేశాల్లో చెత్తను సేకరించి దాన్ని అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరు సైతం తమ వివరాలు నమస్తే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్‌లో వీరికి కేంద్రం తరపున పలు పథకాలు, పింఛన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో 14 మంది చొప్పున మొత్తం 28 మంది కార్మికులను గుర్తించి వారి వివరాలు యాప్‌లో నమోదు చేశారు. నర్సాపూర్‌లో నలుగురిని గుర్తించారు. రామాయంపేటలో మాత్రం ఇంకా నమోదు కార్యక్రమం ప్రారంభం కాలేదు.