
‘నవోదయ’ం ఎక్కడ?
● మూడు ప్రాంతాల్లో స్థలాలు పరిశీలన ● నివేదికలు సమర్పించిన అధికారులు ● ఫైనల్ చేయనున్న జేఎన్‌వీ ● తాత్కాలికంగా విద్యా సంవత్సరం ప్రారంభం
నారాయణఖేడ్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జవహార్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీ) మంజూరు చేసింది. రాష్ట్రానికి 9 కొత్త విద్యాలయాలను గతేడాది మంజూరు చేయగా అందులో సంగారెడ్డి జిల్లాకు ఒక విద్యాలయాన్ని కేటాయించారు. జిల్లాకు కేటాయించిన విద్యాలయం ఏర్పాటు విషయంలో ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంత విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు కేటాయించిన విద్యాలయం మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని విద్యాభిమానులు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
అందోల్ కోసం మంత్రి.. పటన్‌చెరు కోసం ఎంపీ
ఆందోల్ నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటు చేయాలన్న పట్టుతో మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఆందోల్ శివారులో 20 ఎకరాల స్థలాన్ని సైతం అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించారు. తన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో మంత్రి ఉన్నారు. కాగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పటాన్‌చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న యోచనతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల ద్వారా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటుకు యత్నిస్తున్నారు. కాగా, అక్కడ కూడా అధికారులు స్థలాలను పరిశీలించారు. అమీన్‌పూర్ ప్రాంతంలో తగినంత స్థలం అందుబాటులో లేదని అధికారులు గుర్తించారు.
జేఎన్‌టీయూలో తరగతులు..
రాష్ట్రానికి మంజూరైన నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు. జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం తరగతులను తాత్కాలికంగా ఆందోల్‌లోని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేశారు. వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో తరగతులను ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు పరిశీలించి గదులను సిద్ధం చేశారు.
నిజాంపేట్– బాచేపల్లి మార్గంలో స్థలాన్ని
పరిశీలిస్తున్న ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు
తరగతులు ప్రారంభం..
జూలై రెండు లేదా మూడో వారంలో తరగతులు ప్రారంభిస్తున్నాం. ఆందోల్‌లోని జేఎన్‌టీయూలో తాత్కాలికంగా నవోదయ ఏర్పాటుకు భవనాలను పరిశీలించాం. ఈ విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రారంభం అవుతుంది. నవోదయ ఎక్కడ నిర్మించాలనే అంశం జేఎన్‌వీ (జనవహార్ నవోదయ విద్యాలయం) బృందం నిర్ణయించాల్సి ఉంటుంది.
– వెంకటేశ్వర్లు,
జిల్లా విద్యాశాఖ అధికారి,సంగారెడ్డి

‘నవోదయ’ం ఎక్కడ?