
ఆయిల్‌పామ్‌తో వందశాతం భరోసా
జహీరాబాద్ టౌన్: ఆయిల్‌పామ్ సాగు రైతులకు ప్రభుత్వం వందశాతం భరోసా కల్పిస్తుందని ఉద్యానశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్‌రావు అన్నారు. మండలం పరిధి గోవింద్‌పూర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉద్యానశాఖ, గోద్రేజ్ ఆగ్రోవిట్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించి 250 ఎకరాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సోమేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పంట భవిష్యత్‌లో లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి 3,750 ఎకరాల లక్ష్యంగా నిర్దేశించుకుని 2500 ఎకరాల రైతుల పేర్లను నమోదు చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికే 1024 ఎకరాలకు పరిపాలన మంజూరు ఇచ్చామన్నారు. ఆయిల్‌పామ్ సాగు కోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తామని తెలిపారు. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంఘం మండలాల్లోని రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని, జిల్లాలోని మిగతా ప్రాంత రైతులు ముందుకురావాలని చెప్పారు. ఆయిల్‌పామ్ గెలలను గోద్రెజ్ కంపెనీ కొంటారని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకుని పంటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి పండరి, సేరికల్చర్ అధికారి శ్రీనివాస్, గోద్రేజ్ కంపెనీ జిల్లా ఇన్‌చార్జి కొండల్‌రావు, ప్రతినిధి వెంకటేశ్వర్లు, అధికారులు మహేందర్‌సింగ్, మహేశ్, నవదీప్, పాండు, రైతులు పాల్గొన్నారు.
ఉద్యానశాఖ జిల్లా డీడీ సోమేశ్వర్‌రావు