
మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
మంత్రి కొండా సురేఖ
సంగారెడ్డిజోన్: ప్రతీ మహిళను కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలో పెట్రోల్ బంక్ నిర్వహణ కూడా మహిళలే నిర్వహించబోతున్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికే
భూ భారతి: మంత్రి దామోదర
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి జరిగేది జహీరాబాద్ ప్రాంతమేనని వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు అయినా, ఇండస్ట్రియల్ జోన్ అయినా తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు.
లక్ష ఎకరాలకు సాగు నీరు:
ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ ప్రాంతంలో చెరువులు, నదులు లేకపోవటంతో సాగు, తాగు నీటి అవసరాలకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు సీఎం రేవంత్‌ను కోరారు. జహీరాబాద్ ప్రాంతంలోని రైతులు అధికశాతం చెరకు, ఆలు, అల్లం తదితర వాణిజ్య పంటలను పండిస్తుంటారని చెప్పారు. లక్ష ఎకరాలకు నీరందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని రోడ్లు అధ్వాన్నంగా తయారైయ్యాయని, రోడ్ల మరమ్మతులకు రూ.72 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు రూ.20లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి దిశగా: ఎంపీ షెట్కార్
జహీరాబాద్ నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధి రంగంలో దూసుకుపోతోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ వచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభంలో మూడు వేల ఎకరాలు సేకరిస్తే, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భూ సేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఇక్కడి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయాన్నారు. రూ. 250కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి:
మాజీ మంత్రి చంద్రశేఖర్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ గురించి పూర్తిగా విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి రాకతో జహీరాబాద్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యి, అభివృద్ధికి బాటలు పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం

మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం