
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ ప్రయాణికుల సలహాలు సూచనలకు శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు 99592 26267 నంబర్‌కు సంప్రదించవచ్చని సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.
పురుషులకు
టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: పురుషులకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్లు పురుషులు ఈ నెల 31 నుంచి నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సంగారెడ్డి బైపాస్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, 97044 46956, 94901 29839 సంప్రదించాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తామని పేర్కొన్నారు.
రజతోత్సవ సభను
జయప్రదం చేయండి
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
సంగారెడ్డి: తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఈ నెల 31న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించనున్న ‘‘జర్నలిస్టు జాతర’’రజతోత్సవ సభకు ఉమ్మడి మెదక్ జర్నలిస్టులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని తెంజూ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో శుక్రవారం టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్‌ను ఫోరం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు శ్రీధర్, పరశురాం, యోగానందరెడ్డి, సునీల్, శ్రీనివాస్, రాము, నాని తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల గదుల
నిర్మాణానికి రూ.50లక్షలు
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి న్యూలాండ్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి రూ.50 లక్షలు మంజూరు చేస్తూ అనుమతులిచ్చినట్లు మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..గతేడాది పాఠశాలలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాఠశాల సమస్యను వివరించారు. ఈ మేరకు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతూ సహకారం అందించడం పట్ల ఆయనకు, పరిశ్రమ యాజమాన్యానికి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు వారు పేర్కొన్నారు.
బస్సులు నడపండి..
బాధలు తీర్చండి
మెదక్ మున్సిపాలిటీ: పలు రూట్లలో బస్సులు నడపాలని కోరుతూ పలువురు ప్రయాణికులు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు విన్నవించారు. మెదక్ నుంచి వెల్పుగొండ మీదుగా రేగోడ్‌కు, మెదక్ నుంచి టేక్మాల్, బొడ్మట్‌పల్లి మీదుగా జోగిపేట, సంగారెడ్డి. పటాన్‌చెరుకు, అలాగే ఉదయం 6 గంటలకు మాచారం మీదుగా జేబీఎస్ వరకు, టేక్మాల్ నుంచి నర్సాపూర్‌కు బస్సు నడపాలని కోరారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ సురేఖ ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు.
సమానత్వం కోసం ఉద్యమిద్దాం
నిజాంపేట (మెదక్): అన్నిరంగాల్లో సమానత్వం కోసం ఉద్యమించాలని మహిళా రైతు హక్కుల వేదిక రాష్ట్ర నాయకురాలు, సామాజిక కార్యకర్త ఆశాలత పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇప్పటికీ 65 శాతం దళిత మహిళలు భూమి లేని కూలీలుగా ఉన్నారని, వారికి సామాజిక భద్రత కరువైందన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం