
ఆపరేషన్ కగార్‌ను విరమించాలి
కేంద్రానికి వామపక్షాలు విజ్ఞప్తి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆపరేషన్ కగార్‌ను విరమించి, మరణ హోమాన్ని ఆపాలని వామపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెహమాన్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్, ప్రశ్నించే గొంతులను, ఆదివాసులను అతిక్రూరంగా బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి మారణహోమాన్ని సృష్టిస్తోందన్నారు. మావోయిస్టులతోపాటు ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి శాంతి చర్చలు జరపాలని సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపకుండా మావోయిస్టులను చంపడం అత్యంత హేయమన్నారు. ఈ మారణ హోమంలో మావోయిస్టులు, ఆదివాసులు, మిలిటరీ జవాన్లు కూడా చనిపోతున్నారని, ఇవన్నీ పట్టించుకోకుండా కేంద్రం నిరంకుశ వైఖరితో ఎన్‌కౌంటర్లు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఫాసిస్టు నైజమని మండిపడ్డారు. మారణ హోమాన్ని ఆపకపోతే విపక్ష పార్టీలు ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చింత గంగయ్య, సయ్యద్ సమద్, మల్లేశ్, అసద్, తిరుమలేశ్, సమతా సైనికదళ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించిన సీపీఎం
సంగారెడ్డి: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సీపీఎం సంగారెడ్డి ఏరియా కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆ పార్టీ నాయకుడు యాదగిరి సూచించారు. మావోయిస్టు రాజకీయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, చర్చల కోసం వారు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి అన్ని పారా మిలిటరీ కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.