
కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): నిత్యం రైతుల మధ్యలో ఉంటూ రైతుల సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పరిధిలోని మెట్టపాంత్రాల వ్యవసాయ పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్)ను శుక్రవారం రైతు కమిషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇక్రిశాట్ ఏర్పాటు చేశారన్నారు. అందుకు ఇక్రిశాట్‌కు 3,500 ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఇక్రిశాట్ వ్యవసాయ పరిశోధనలు చేస్తోందని వివరించారు. సాంప్రదాయ పంటలను అభివృద్ధి చేసేందుకు ఇక్రిశాట్ సేవలు దోహదపడుతున్నాయన్నారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం ఇక్రిశాట్ సందర్శించానని, ప్రభుత్వంతో క లసి కొనసాగిస్తున్న ప్రాజెక్టులపై సమీక్షించినట్లు గుర్తుచేశారు. తాము కూడా శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేసినట్లు వివరించారు. మెట్ట పంటల అభివృద్ధి, విత్తన పరిశోధన, మట్టి ఆరోగ్యం, నీటి వినియోగం అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు రామ్‌రెడ్డి గోపాల్‌రెడ్డి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్షు పతక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్, వ్యవసాయ అధికారులు హరి వెంకట్‌ప్రసాద్, సురేశ్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా.హరికిషన్, డా.జానిలా పాల్గొన్నారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఇక్రిశాట్
మారుతున్న పరిస్థితులకనుగుణంగా పరిశోధనలు
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి