
శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
సంగారెడ్డి క్రైమ్: ఔత్సాహికులైన పట్టణ యువత, మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తోంది జిల్లా కేంద్రంలోని సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్)శిక్షణ కేంద్రం. పట్టణంలో ముఖ్యంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండేలా శిక్షణ ఇవ్వడంపై సెట్విన్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. ఫలితంగా ఇటి వద్దే వివిధ రకాల వృత్తి వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది.
మరింత విస్తృతం
సెట్విన్ కేంద్రాన్ని ఆరేళ్ల కిందట ఆరు కోర్సులతో జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ప్రస్తుతం మరిన్ని కోర్సులను అందుబాటులకు తెచ్చి సేవలు విస్తృతం చేసేందుకు సెట్విన్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్సుల తీరును బట్టి మూడు నుంచి 12 నెలల డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. కోర్సులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకుంటున్నారు.
ఉపాధి ఉద్యోగ అవకాశాలు
యువతకు అండగా నిలుస్తున్న
సెట్విన్ కేంద్రం
అందుబాటులో పలు కోర్సులు
జాబ్ మేళాల నిర్వహణతో
ఉద్యోగ అవకాశాలు
శిక్షణకు కావాల్సిన అర్హతలు
పదో తరగతి మొదలు పీజీ వరకు చదివిన అభ్యర్థులకు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.
ఒక బ్యాచ్‌కు 300 మంది అభ్యర్థుల చొప్పున శిక్షణ ఇచ్చేందుకు కేంద్రంలో వసతులున్నాయి.
ప్రతీ సంవత్సరం 1000 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేయడంతోపాటు ప్రతీ సంవత్సరం జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
అందుబాటులో ఉన్న కోర్సులు
విద్యా అర్హత, ఆసక్తి ప్రతిపాదికన వివిధ కంప్యూటర్ కోర్సులతోపాటు, సాంకేతిక కోర్సుల్లో ఇక్కడ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ప్రసుత్తం అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, రీటేయిల్ సేల్స్ అసోసియేట్స్, ఫీల్ట్ టెక్నీషియన్, నెట్ వర్కింగ్, స్టోరేజీ, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
జిల్లా కేంద్రంలోని సెట్విన్ కేంద్రంలో వివిధ కోర్సుల్లో శిక్షణ ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి బ్యాంక్ ద్వారా రుణాలు అందించేందుకు సహకరిస్తున్నాం. – శివ కుమార్, సెట్విన్ ఇన్‌చార్జి