
ఎండోమెంట్ భూములు కబ్జా
దుబ్బాకరూరల్: అక్రమ కబ్జాదారులు ప్రభుత్వ భూములే కాకుండా ఎండోమెంట్ భూములను కూడా కబ్జాకు పాల్పడుతున్నారు. దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. 417, 418 సర్వే నంబర్లలో 12 ఎకరాలు భూమి ఎండో మెంట్ పరిధిలో ఉంటుంది.దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ దాని చుట్టుపక్కల భూమి ఉన్న కొందరు 12 ఎకరాలపై కన్నేసి కబ్జాకు పాల్పడుతున్నారు. ఆ భూమిని ఆక్రమించడమే కాకుండా నూతనంగా భవనాలు నిర్మించారు. ఇప్పటికి కొంత మంది భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
దేవాలయ భూములు కబ్జాకు గురైతున్నాయని గ్రామస్తులు కలెక్టర్, దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎండోమెంట్ అధికారులు పలుమార్లు భూములను సర్వే చేశారు. భూములు కబ్జా చేసిన వ్యక్తులు కొంత మంది అధికారులకు మామ్ములు ఇస్తూ తమకు అనుకూలంగా చేయించుకుంటున్నారు. ఇదేమిటని గ్రామస్తులు అడిగితే భూములు సర్వే చేస్తున్నామని చెబుతున్నారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల సర్వే అధికారులు భూములను తూతూ మంత్రంగా సర్వే చేశారు తప్ప కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎండో మెంట్ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఆక్రమణకు గురవుతున్న వేణుగోపాల
స్వామి ఆలయం భూములు
నూతనంగా భవంతులు నిర్మాణం
అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ