
13 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరు వలస కూలీలు అరెస్ట్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ బర్మన్, తపన్ బిశ్వాస్ జీవనోపాధి నిమిత్తం తెల్లాపూర్‌కు వలసొచ్చారు. స్థానిక నిర్మాణ రంగ సంస్థలో కూలీలుగా పని చేస్తున్నారు. ఇద్దరూ గంజాయి విక్రయించి డబ్బులు సంపాదించాలనుకున్నారు. బెంగాల్ ప్రాంతానికి చెందిన కృష్ణ విజయవాడ వరకు గంజాయిని తీసుకొచ్చాడు. అతడి వద్ద నుంచి వీరిద్దరూ 13 కిలోలు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి తీసుకొచ్చి కూలీలకు విక్రయించేందుకు శుక్రవారం ఉస్మాన్‌నగర్‌లోని బస్టాండ్ వద్ద వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించడంతో కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

13 కిలోల గంజాయి స్వాధీనం