మారిన ఉపాధి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మారిన ఉపాధి ప్రాధాన్యత

May 20 2025 7:34 AM | Updated on May 20 2025 7:34 AM

మారిన ఉపాధి ప్రాధాన్యత

మారిన ఉపాధి ప్రాధాన్యత

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల ఎంపికలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మట్టి పనులను పూర్తిగా తగ్గించి.. ఆస్తులు సృష్టించే పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానంగా బిల్డింగులు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యత కల్పించాలని పేర్కొంది. అలాగే పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు, కిచెన్‌షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసింది.

‘పూడిక తీత’ తగ్గించండి

ఈ పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పూడికతీత పనుల్లో అక్రమర్కుల ‘మేత’ కూడా ఎక్కువగా ఉంటోంది. ఉపాధి హామీ పనులపై నిర్వహిస్తున్న సోషల్‌ ఆడిట్‌లో తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడితే ప్రజలకు చాలా మటుకు ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పూడిక తీత పనుల అంచనాల తయారీని తగ్గించారు.

2.11 లక్షల మంది కూలీలు

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లా లో 657 గ్రామాల్లో పనులు నడుస్తున్నాయి. మొత్తం 2.19 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఈ జాబ్‌కార్డుల్లో మొత్తం 4.03 లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో రెగ్యులర్‌గా ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్య 2.11 లక్షల మంది ఉంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో రూ.30.96 కోట్ల మేరకు పనులు చేపట్టారు.

నీటి సంరక్షణ పనులు కూడా..

నీటి సంరక్షణ పనులు కూడా ఈసారి ఉపాధి హామీ పనుల్లో చేపట్టనున్నారు. ప్రధానంగా చెక్‌డ్యాంలు, పర్కులేషన్‌ట్యాంకులు, ఓపెన్‌వెల్స్‌, ఫాంపాండ్‌లు, వాటర్‌ హార్వేస్టింగ్‌ పాండ్‌లు, రూఫ్‌ హార్వేస్టింగ్‌ స్ట్రక్చర్లు, బోర్‌వెల్‌ రీచార్జి కట్టడాలు వంటి పనులను కూడా ఈసారి ఉపాధి హామీలో చేపడుతారు.

మట్టి పనులు తగ్గించి.. ఆస్తులు సృష్టించే పనులు ఎంపిక

జీపీ, అంగన్‌వాడీ భవనాల

నిర్మాణానికి ప్రాధాన్యత

పూడికతీత పనులు

తగ్గించాలని ఆదేశాలు

ప్రాధాన్యత పనులకు లక్ష్యాలు

ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో ఈ పథకం కింద చేపట్టనున్న పనులకు సంబంధించిన లక్ష్యాలను కూడా నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పనులను వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 54 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, 54 చోట్ల పాఠశాలల కిచెన్‌షెడ్లు, ప్రహరీగోడలు నిర్మించాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో లింకు రోడ్లకు కూడా ఈ నిధులను కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement