
సర్కారు బడి.. సీట్లకు పోటీపడి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడులకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు సీటు కావాలంటూ పెద్ద ఎత్తున రికమండేషన్‌లు వస్తున్నాయంటే సర్కార్ పాఠశాలలకు ఉన్న డిమాండ్ ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా సర్కార్ బడులకు పెరుగుతున్న ఆదరణ, విద్యార్థులకు అనుగుణంగా మరింత మౌలిక సదుపాయలను కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నత విద్య చదివిన వారే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేస్తున్నారు.
ఆధునిక భవనాలు..
మండల పరిధిలో రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, తెల్లాపూర్, కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెలలో జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. ఉస్మాన్‌నగర్‌లో కస్తూర్బా, వెలిమెల ప్రభుత్వ తెలంగాణ మోడల్ పాఠశాలలున్నాయి. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పలు పాత భవనాలను కూల్చి దాతల సహకారంతో నూతన ఆధునిక భవనాలను నిర్మించారు. మౌలిక సదుపాయాలను కల్పించారు.
డిజిటల్ బోధన... పలు అంశాలపై శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నారు. దానితోపాటు కంప్యూటర్‌పై విద్యార్థులకు మరింత పరిజ్ఞానం పెంచాలన్న లక్ష్యంతో ప్రత్యేక బోధన చేస్తున్నారు. ఆధునిక ౖసైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరాటేలో శిక్షణ అందిస్తున్నారు.
ఉత్తమ ఫలితాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అనేక పాఠశాలలు వందకు వంద శాతం ఉతీర్ణత సాధిస్తున్నాయి. అందుకు జిల్లా ఉన్నతాధికారులు చొరవతీసుకుని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నారు. అందుకనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
జోరుగా ప్రచారం..
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లోని విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, సాధించిన ఫలితాలను కరపత్రాలను తయారు చేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దాంతో అనేకమంది తల్లిదండ్రులు వారి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు.
పలు సమస్యలతో ఇబ్బందులు..
ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న పలు పాఠశాలల్లో సమస్యలతో ఇబ్బందులు తప్పడంలేదు. తెల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 450 మంది విద్యార్థులున్నారు. కేవలం 7మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. గతేడాది ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వచ్చారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం 19మంది ఉపాధ్యాయులు ఉండాలి. బీహెచ్‌ఈఎల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 686మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో హాస్టల్ ఉండటం కారణంగా తరగతి గదుల కొరత ఉంది. సుమారు 7మంది ఉపాధ్యాయులు అవసరం ఉంది. కొల్లూరు పాఠశాలలో పలు సమస్యలున్నాయి. విద్యార్థులను గదుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం నివాసులు ఇతర ప్రాంతాల నుంచి రావడంతో ఇక్కడ ఉర్దూ మీడియం పాఠశాల అవసరం ఉంది. ఈదులనాగులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సాంఘికశాస్త్రంకు సంబంధించిన ఉపాధ్యాయుల కొరత ఉంది.
సర్కార్ బడుల్లో చేర్పించేందుకు
తల్లిదండ్రుల ఆసక్తి
మరిన్ని సౌకర్యాలు
కల్పించాలంటున్న స్థానికులు
కరపత్రాలతో టీచర్లు జోరుగా ప్రచారం
అడ్మిషన్లు పెరుగుతున్నాయి
ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌లు పెరుగుతున్నాయి. ఇంగ్లిష్‌మీడియంలో పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. మా పాఠశాలలోని సదుపాయాలు, ఫలితాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. పాఠశాలలో అడ్మిషన్‌ల కోసం పెద్దల నుంచి సైతం ఫోన్‌లు వస్తున్నాయి.
– టి.భాస్కర్, ప్రధానోపాధ్యాయులు,
తెల్లాపూర్ జిల్లాపరిషత్ పాఠశాల.

సర్కారు బడి.. సీట్లకు పోటీపడి

సర్కారు బడి.. సీట్లకు పోటీపడి