
25 ఏళ్ల క్రితం వాటర్‌షెడ్ పథకానికి శ్రీకారం
నియోజకవర్గవ్యాప్తంగా గతంలో చేపట్టిన వాటర్‌షెడ్ పనులు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడ్డాయి. ప్రముఖ ఇంజనీర్ హన్మంత్‌రావు చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001 సంవత్సరంలో వాటర్‌షెడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎత్తయిన ప్రదేశంలో పడిన వర్షం నీరు చిన్న చిన్న వంకలుగా, వాగులుగా ఏర్పడి పల్లపు ప్రాంతానికి ప్రవహించి ఒక పెద్ద వాగు లేదా కాలువ ద్వారా బయటకు పోయే ప్రదేశాన్ని నీటి పరీవాహక ప్రాంతం లేదా వాటర్‌షెడ్ అంటారు. చతుర్విద జల ప్రక్రియలో నాలుగు అంశాలు ప్రధానమైనవి. 1. వాన నీటిని నిలువరించడం. 2) భూగర్భంలోకి నీటిని ఇంకించడం. 3) లోయ ఉపరితలంలో నీటిని నిల్వ చేయడం. 4) భూమిలో తేమను కాపాడటం. రిడ్జ్ టు వ్యాలీ (శిఖరం నుంచి లోయ) విధానంతో, ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి సిమెంట్, కాంక్రీట్ లేకుండా ఒక వాటర్ షెడ్ ఏరియాను సృష్టించడం. వాటర్‌షెడ్ పథకంతోపాటు వర్షాలు సైతం ఆశించిన మేర కురవడంతో నీటి ఊటలు పుష్కలంగా ఉన్నాయి.