వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్య

May 16 2025 6:31 AM | Updated on May 16 2025 6:31 AM

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్య

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్య

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గురువారం వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి తల్లీకొడుకు..

కల్హేర్‌(నారాయణఖేడ్‌): భర్త మరణించాడనే మనోవేదనతో కొడుకుతో కలిసి తల్లి నిజాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంసాగర్‌ ఎస్‌ఐ శివకుమార్‌ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ మండలం మునిగేపల్లికి చెందిన దార ప్రమీల(30), కుమారుడు అక్షయ్‌(8)ను వెంటబెట్టుకొని బ్యాంకు పని నిమిత్తం వెళ్లి వస్తామని చెప్పి బుధవారం ఇంటి నుంచి బయల్దేరింది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చి 20 గేట్‌ వద్ద కొడుకుతో కలిసి నీటిలోకి దూకింది. ఈ క్రమంలో ప్రాజెక్టులో చేపలు పట్టే మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శివకుమార్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను బయటకు తీయించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా ప్రమీల భర్త దార సాయిలు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రమీల జీవితంపై విరక్తి చెందింది. మృతురాలికి కూతురు నిహారిక ఉంది. తల్లికొడుకు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె ఇంట్లో లేదు. దీంతో ప్రాణాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు తీర్చలేక..

చిన్నశంకరంపేట(మెదక్‌): అప్పులు చేసి దుబాయికి వెళ్లిన వ్యక్తి తీర్చేందుకు పొలం కుదువ పెడుదామని ప్రయత్నించి విఫలమై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్‌ కథనం ప్రకారం... శాలిపేట గ్రామానికి చెందిన మాలే సత్యనారాయణ(40)కు భార్యాపిల్లలున్నారు. పదేళ్ల క్రితం దుబాయి వెళ్లేందుకు అప్పులు చేశాడు. దుబాయి నుంచి తిరిగి వచ్చినప్పటికీ చేసిన అప్పులు మాత్రం తీరలేదు. తనకు ఉన్న 30 గుంటల పొలంతో బతకడం కష్టమని భావించి గత ఏడాది నుంచి మేడ్చల్‌లో పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చినవాళ్లు అడుగుతుండటంతో గ్రామంలో ఉన్న భూమిని కుదువపెట్టి రూ. 2 లక్షలు ఇవ్వాలని పలువురిని అడిగినా అప్పు పుట్టే మార్గం కన్పించలేదు. దీంతో బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అతడు పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

విషం తాగి వ్యక్తి...

పాపన్నపేట(మెదక్‌): విషం తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శానాయపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సంబధీకుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గజ్జెన లాలయ్య(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం విషం తాగి ఇంట్లో వాంతులు చేసుకుంటూ పడి పోయాడు. కుటుంబీకులు గమనించే లోగా మృతి చెందాడు. కుటుంబీకుల పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఎస్సై నరేష్‌ను వివరణ కోరగా ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

అనారోగ్య సమస్యలతో..

మిరుదొడ్డి(దుబ్బాక): అనారోగ్య సమస్యలు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ధర్మారంలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌ కథనం ప్రకారం... ధర్మారం గ్రామానికి చెందిన చెప్యాల రాజు, గౌరమ్మ దంపతుల కుమార్తె సౌమ్య (18) రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

సౌమ్య (ఫైల్‌)

సత్యనారాయణ(ఫైల్‌)

మోసపోయి యువకుడు..

భాను ప్రకాష్‌ (ఫైల్‌)

బైక్‌ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నం..

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): బైక్‌ కొనివ్వలేదని నిరాశకు గురైన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తుల కథనం ప్రకారం... మండల పరిధిలోని మామిడ్గి గ్రామానికి చెందిన సాలమాన్‌(35) కొన్ని రోజులుగా బైక్‌ ఇప్పించాలని తల్లి మొగులమ్మను అడుగుతూ వస్తున్నాడు. దీంతో మూడు రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడు. గురువారం ఉదయం బైక్‌ ఇప్పించాలని తల్లిని అడుగగా గ్రూపులో డబ్బులు కట్టాల్సి ఉందని, తర్వాత ఇప్పిస్తానని నచ్చజెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన సాలమాన్‌ బావిలో దూకుతానని తల్లికి చెప్పి వెళ్లాడు. గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బావిలో ఉన్న మోటరు పైపును పట్టుకుని నీళ్లలో ఉండిపోయాడు. వెంటనే గ్రామస్తులు నచ్చజెప్పి పైకి రావాలని కోరారు. దీంతో తాడు కట్టుకుని పైపు సహాయంతో పైకి వచ్చాడు.

మిరుదొడ్డి(దుబ్బాక): వీసా విషయంలో బ్రోకర్లు మోసం చేశారన్న మనోవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ హరీశ్‌ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గోత్రాల రాజు పద్మల ఏకై క కుమారుడు భాను ప్రకాశ్‌ (27) గత ఏడాది జూలైలో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అక్కడ వీసా విషయంలో బ్రోకర్లు మోసం చేశారని తేలడంతో ఈ ఏడాది జనవరిలో స్వగ్రామమైన మోతెకు తిరిగి వచ్చాడు. దీంతో సౌదీకి వెళ్లడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదన పడుతుండేవాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. గురువారం తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement