
సేవామార్గం.. సమాజ హితం
నర్సాపూర్ రూరల్: జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో క్షేత్ర స్థాయిలో సమస్యలు, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన, నాయకత్వ లక్షణాలతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగిందని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ –1 విద్యార్థులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన
నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో ఇటీవల వారం రోజులపాటు వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు గ్రామంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు ఆయా వీధుల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించి పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతోపాటు బేటీ బచావో–బేటీ పడావో, బాల్య వివాహాలు, మత్తు పదార్థాలు, ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలు, ఆడపిల్లలను చదివించాలని చైతన్య పరిచారు.
ఇంటింటికీ వెళ్లి సర్వే
గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై సర్వే నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో అధ్యాపకులతోపాటు పలువురు వక్తలు వివిధ అంశాలపై ఇచ్చిన ఉపన్యాసాలతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. గ్రామస్తులను చైతన్యపరిచేందుకు ఆటపాటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ు ప్రదర్శించారు.
నాయకత్వ లక్షణాలు మెరుగుపడ్డాయి
ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు మెరుగుపడ్డాయి. దీంతోపాటు టీమ్ వర్క్ అలవాటైంది. బృందాలుగా ఏర్పడి రోజు వారి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాం. చదువుతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. – దాసరి శివరాజ్, విద్యార్థి, బీఏ సెకండ్ ఇయర్
క్రమశిక్షణ అలవాటైంది
జాతీయ సేవా శిబిరంలో వారం రోజులపాటు పాల్గొనడంతో క్రమశిక్షణ అలవాటైంది. ఉదయం లేచి గ్రామంలో శ్రమదానం చేయడంతోపాటు మధ్యాహ్నం అధ్యాపకులు, వకల ఉపన్యాసాలతో కొత్త విషయాలు తెలుసుకున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల జీవన విధానం, సమాజంపై అవగాహన కలిగింది.
– ఎస్. ప్రణయ, విద్యార్థిని, బీస్సీ ఫస్ట్ ఇయర్
సేవలపై అవగాహన అవసరం
ప్రతీ విద్యార్థికి చదువుతో పాటు సేవా కార్యక్రమాలపై అవగాహన అవసరం. జాతీయ సేవా పథకం ద్వారా క్రమశిక్షణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై అవగాహన వస్తుంది. ప్రజల జీవన విధానం, సామాజిక, ఆర్థిక విషయాలపై అవగాహన పెరుగుతుంది. –డాక్టర్ సురేశ్ కుమార్,
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాంఅధికారి
ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
గ్రామాల్లో చెత్తాచెదారం తొలగింపు
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన
నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుదల : వలంటీర్లు