
వారం రోజుల్లో కూతురి పెళ్లి
అల్లాదుర్గం(మెదక్): కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఓ తండ్రికి గుండెపోటుతో రావడంతో మృతి చెందాడు. కొడుకులు లేకపోవడంతో కూతురే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నడిపోళ్ల నాగయ్య (53) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు తేజ, అశ్విని. ఈ నెల 21న తేజ పెళ్లి నిశ్చమైంది. ఈ పనుల్లో బిజీగా ఉండగా నాగయ్యకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలి మృతి చెందాడు. కొడుకులు లేక పోవడంతో కూతురు తేజ తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా తండ్రి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుండెపోటుతో తండ్రి మృతి
తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు