
తరుగు సమర్పయామి
తరుగుతీత కేంద్రాలుగా మారిన కొనుగోలు కేంద్రాలు
● క్వింటాలు జొన్నకు 5 కిలోలు తీస్తున్న వైనం ● సుతిలికీ డబ్బులు.. హమాలీ రూ.80 వసూలు ● పంట అమ్ముకునేందుకు వారం పడిగాపులు
నారాయణఖేడ్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర దక్కుతుందని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. టోకెన్లు పొందడం నుంచి పంటను అమ్ముకునే వరకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంతా చేసినా క్వింటాలుకు తరుగు పేర 5కిలోలు సమర్పించుకోక తప్పడంలేదు. జొన్న విక్రయాల్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ ప్రాంతంలో జొన్న పంట సాగు జరుగుతుంది. మనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో తరుగు పేర యథేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారు. 50కిలో చొప్పున తూకం వేయాల్సిన బస్తా 52.5కిలోల నుంచి 53కిలోల వరకు తూకం వేస్తున్నారు. క్వింటాలు వద్ద 5 నుంచి 6కిలోల తరుగు పేర దోపిడీకి పాల్పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టోకెన్లకే నాలుగైదు రోజులు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.3,371 మద్దతు ధరకు రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. బయటి మార్కెట్‌లో రూ.2,200 నుంచి రూ.2,500 లోపే ఉండటంతో రైతులు కేంద్రానికి పంటను తీసుకు వస్తున్నారు. కేంద్రంలో అమ్ముకునేందకు టోకెన్లకు కూడా నాలుగైదు రోజులు తిరిగి దక్కించుకోవాల్సి వస్తుందని, టోకెన్లు లభించినా కేంద్రం వద్ద ఐదారు రోజులు పడిగాపులు పడుతున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉన్నా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోతున్నారు.
అమ్ముకునేందుకు పడిగాపులు
పంటలను ఈ కేంద్రంలో అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో రైతు నాలుగైదు రోజులు కేంద్రం వద్ద వాహనాలతో ఉండాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు వాహనం రవాణా చార్జీలు భారంగా మారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటాలుకు 5 నుంచి 6 కిలోల చొప్పున తరుగు పేర దోపిడీకి తోడు సుతిలి (తాడు) పేర డబ్బులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. క్వింటాలు హమాలీ కింద రూ.80 వసూలు చేస్తున్నారు.

తరుగు సమర్పయామి