
ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇన్ పేషంట్ తదితర వార్డుల్లో కలియదిరిగి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుపేదలే ప్రభుత్వాస్పత్రికి వస్తారని, వారికి మెరుగైన సేవలను అందించాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. వైద్యులు, సిబ్బంది పనితీరును పరిశీలించాలని సూపరింటెండెంట్ శ్రీధర్‌ను ఆదేశించారు.
సంగారెడ్డిలో భారీ వర్షం
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి పట్టణంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో వేసవితాపంతో అల్లాడుతున్న పట్టణ ప్రజలకు కొంచెం ఉపశమనం లభించినట్లైంది. భారీ వర్షానికి మురికి కాలువల నీరు రోడ్లపై వెళ్లడంతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతీసారి రోడ్లపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
జహీరాబాద్ టౌన్: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాల రద్దు కోసం ఈ నెల 20 నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సమ్మె పోస్టర్‌ను సీఐటీయూ నాయకులు బుధవారం జహీరాబాద్ మహీంద్ర కంపెనీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. లేబర్ కోడ్ వంటి చట్టాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కనకారెడ్డి, గణేశ్, నరేష్, శేఖర్,రాజు తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో కొత్తగా బీబీఏ, బీకాం కోర్సులు
సదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులతోపాటు కొత్తగా బీబీఏ, బీకాం,(బీఎఫ్‌ఎస్‌ఐ) కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ భారతి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ‘దోస్త్’ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీకాం(బీఎఫ్‌ఎస్‌ఐ) కోర్సు ద్వారా పారిశ్రామిక రంగానికి అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ