
వారంలో సీఎం రేవంత్ పర్యటన!
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం
న్యాల్‌కల్(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్థానిక ఎంపీపీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో సీఎం జహీరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజల నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. న్యామతాబాద్, శంశల్లాపూర్, టేకూర్, హుస్సేన్ నగర్, మల్గి, కాకిజన్‌వాడ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. డప్పూర్, న్యామతాబాద్, వడ్డి, హద్నూర్, రుక్మాపూర్, రాంతీర్థ్ తదితర గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య గురించి విద్యుత్ ఎస్‌ఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, రాజీవ్ వికాస్ తదితర పథకాలను గూర్చి సమావేశంలో చర్చించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ రఘువీర్, డీఈఈ సుజాన్, డీపీఓ సాయిబాబా, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, ఆర్డీవో రాంరెడ్డి, ఎంపీఓ సౌజన్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.