
వరకట్న వేధింపుల కేసులో నలుగురు అరెస్ట్
సిద్దిపేటకమాన్: వరకట్న వేధింపుల కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ ఉపేందర్‌తో కలిసి ఏసీపీ మధు కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెన్న పవన్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామానికి చెందిన దంతూరి పుష్ప, భిక్షపతిల కూతురు అక్షయ (25)ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020లో ఇరు కుటుంబ సభ్యులు రూ.5 లక్షల కట్నంతో పాటు నాలుగు తులాల బంగారం పెట్టి మళ్లీ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు. పవన్ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్నాడు. అప్పటినుంచి అదనపు కట్నం కోసం అక్షయను భర్త పవన్, అతడి కుటంబ సభ్యులు వేధిస్తుండటంతో భరించలేక 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం అక్షయ భర్త పవన్‌తోపాటు మామ సత్తయ్య, అత్త కనకవ్వ, మరిది కల్యాణ్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.