డిగ్రీ దోస్త్‌ షురువైంది | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ దోస్త్‌ షురువైంది

May 14 2025 8:02 AM | Updated on May 14 2025 8:02 AM

డిగ్రీ దోస్త్‌ షురువైంది

డిగ్రీ దోస్త్‌ షురువైంది

● ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ● మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ ● ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 18,150 సీట్లు

జహీరాబాద్‌ టౌన్‌: ఇంటర్‌ ఫలితాలు వచ్చాయి. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మూడు విడతలుగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. జూన్‌ నెలాఖరు వరకు అడ్మిషన్లు పూర్తి చేసి 30 నుంచి మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమవుతాయి.

డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లలో పారదర్శకతకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి 2025–26 విద్యా ఏడాదికి నోటిఫికేషన్‌ ఉన్న విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణరెడ్డి ప్రకటించారు. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి 20 వరకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి. 28తో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా 29న సీట్ల కేటాయింపు ఉంటుంది. 30 నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. రెండవ విడతలో మే 30 నుంచి జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌, జూన్‌ 13న సీట్ల కేటాయింపు, 18 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. మూడవ విడతలో జూన్‌ 13 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 23న సీట్ల కేటాయింపు, 28 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

బీటెక్‌ వైపు మొగ్గు...

ఇంటర్మీడియెట్‌ తర్వాత డిగ్రీలో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో దోస్త్‌ అడ్మిషన్ల గడువు ముగిసినా ఇంకా సీట్లు మిగులుతున్నాయి. ఇంటర్‌ తర్వాత బీటెక్‌ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. సత్వర ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో మొగ్గు చూపుతున్నారు. బీటెక్‌లో కోర్సు పూర్తికాకముందే క్యాంపస్‌ సెలక్షన్‌లో చాలామంది విద్యార్థులు ఎంపికవుతున్నారు. మంచి వేతనాలు కూడా అందడంతో బీటెక్‌ కోర్సుల్లో చేరుతున్నారు.

జిల్లాల వారీగా సీట్లు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌,సాంఘిక,గిరిజన సంక్షేమ కళాశాలల్లో 18,150 సీట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 8,150, మెదక్‌ జిల్లాలో 4,800, సిద్దిపేట జిల్లాలో 7,400 సీట్లున్నాయి. డిగ్రీ కోర్సులను అవగాహనతో ఎంచుకోవాలి. డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి సైతం సత్వర ఉద్యోగ అవకాశాలున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి, బీకాంలో కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకుంటే కంప్యూటర్‌ ఆపరేటర్లు,అకౌంటెంట్లుగా చేసుకునేందుకు వీలు ఉంటుంది. బీఎస్సీ పూర్తి చేసిన వారికి ఫార్మా కంపెనీలో కెరీర్‌ ఉంటుంది. మ్యాథ్స్‌ సబ్జెక్టుకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. డిగ్రీ చదివిన వారు ఎంబీఏ, ఎంసీఏ కూడా చేయవచ్చు. ఆర్ట్స్‌ కోర్సులు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. డిగ్రీ, పీజీ కోర్సులు చేసినా ఉపాధి అవకాశాలు ఉండటంలేదని ఇంటర్‌ నుంచే ఆర్ట్స్‌ గ్రూపులో చేరడం లేదు. ప్రైవేట్‌ కళాశాలలో దాదాపు ఈ గ్రూపు ఉండటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement