
సేంద్రియ వ్యవసాయమే పంటకు బలం
జహీరాబాద్: సేంద్రియ వ్యవసాయంతోనే పంటకు బలమని, ఈ దిశగా రైతులు ఆసక్తి పెంచుకోవాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భిక్షపతి సూచించారు. కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లిలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట పంటలను వేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. రైతులు యూరియాను అధిక మొత్తంలో వాడడం వల్ల చీడ పీడల సమస్య, సాగు ఖర్చు పెరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పంట మార్పిడి చేయడం వల్ల నేల సారవంతమవుతుందని తెలిపా రు. బిందుసేద్య పద్ధతివలన సాగునీటి వనరులు ఆదాచేసి భావి తరాల వారికి అందించవచ్చన్నారు. బసంత్‌పూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం, కందిలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నవీన్‌కుమార్, శాస్త్రవేత్తలు విజయలక్ష్మిం, రాజేందర్, శ్రీనివాసులు ఏఈఓలు స్వాతి, సంధ్య, సవిత, మౌనిక, వర్మ, ప్రవీణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
రైతుల అవగాహన సదస్సులో ఏడీఏ భిక్షపతి