
విద్యార్థుల నమోదు పెంచాలి
కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: బోధన విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉపాధ్యాయులకు సూచించారు. సంగారెడ్డిలోని బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యా యులు విద్యార్థులకు ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం విధిగా నేర్పించాలన్నారు. సాంఘికశాస్త్రం శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రణాళికలు, కోర్సు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఎమ్మార్పీలకు ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోతిరెడ్డిపల్లిలో 126 ఎస్‌జీటీలు, ఆర్పీలు, ఎస్‌ఏలు, 62 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌లు తదితరులు పాల్గొన్నారు.