
మహిళా కళాశాలలో సమస్యలు ఉండొద్దు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి: మహిళా డిగ్రీ కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లో అదనపు వసతి గదులతో పాటు మూడు వందల మంది విద్యార్థినులకు సరిపోయేలా కిచెన్, డైనింగ్ గదులు మూడు అంతస్తుల్లో ఏర్పాటు అయ్యేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మినీ ఆడిటోరియం, హాస్టల్ భవనం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో కావాల్సిన అన్ని మరమ్మతులు వెంటనే పూర్తిచేయాలని కోరారు. ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డీఈ రాజు, ఏఈలు రాజ మల్లయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.